Babar Azam likely to take legal action:  టీ 20 ప్రపంచ కప్‌ (T20 World Cup)లో లీగ్ దశలోనే వెనుదిరిగిన పాకిస్థాన్‌ క్రికెట్‌(Pakistan Cricket) జట్టుపై విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థి భారత్‌(India), పసికూన అమెరికా(USA) చేతిలో ఓడిన బాబర్‌ సేన మాజీ ఆటగాళ్ల నుంచి యూట్యూబర్ల దాకా పదునైన విమర్శలతో దాడి చేస్తూనే ఉన్నారు. బాబర్‌ ఆజమ్‌(Babar Azam)కు కొత్త కారు గిఫ్ట్‌ వచ్చిందని కొందరు... ఆటగాళ్లకు గెలవాలనే కసే లేదని మరికొందరు ఇలా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తూనే ఉన్నారు. లీగ్‌ దశలోనే నిష్క్రమించినా పాక్ ఆటగాళ్లు ఇంకా అమెరికానే ఉండడంపైనా కొందరు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలు శృతి మించుతుండడంపై బాబర్‌ ఆజమ్‌ ఆగ్రహంగా ఉన్నాడని.. ఇక మాజీ ఆటగాళ్లు, యూట్యూబర్లపై ఆజమ్‌ చట్టపరమైన చర్యలు తీసుకుంటాడని పాక్‌ వార్త సంస్థలు చెప్తున్నాయి.

సద్విమిమర్శను స్వీకరించడానికి బాబర్‌ సిద్ధంగానే ఉన్నాడని కానీ కొందరు యూట్యూబర్లు మరీ బరితెగించి ఇష్టానుసారంగా ఆధార రహితంగా వార్తలు రాస్తున్నారని బాబర్‌ ఆజమ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు పాక్‌కు చెందిన జియో న్యూస్ తెలిపింది. తన పరువుకు ఇలాంటి వార్తల వల్ల భంగం కలుగుతుందని భావించిన బాబర్‌... లీగల్‌ చర్యలకు పూనుకున్నట్లు కూడా ఆ వార్త సంస్థ తెలిపింది. 
 

ఇక లీగల్‌ చర్యలే

టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌ దుష్ప్రవర్తన కారణంగానే పాక్‌ ఓడిపోయిందని అర్థం పర్థం లేదని ఆరోపణలు చేస్తున్న యూట్యూబర్‌లు, మాజీ క్రికెటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కెప్టెన్ బాబర్ ఆజం సిద్ధమవుతున్నట్లు సమాచారం.  బాబర్‌ పరువు తీయడమే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో అర్థ రహితంగా ప్రచారం చేస్తున్నట్లు బాబర్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పలువురు యూట్యూబర్లు, మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని బాబర్‌ తెలిపినట్లు తెలుస్తోంది.

పాక్‌ క్రికెట్‌ బోర్డు, బాబర్‌పై కొందరు చేసిన ఆరోపణలపైనా పీసీబీ న్యాయ విభాగం ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. పాక్‌ క్రికెట్‌ బోర్డుపై కూడా కొందరు మాజీ క్రికెటర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్‌ క్రికెట్‌ బోర్డు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని.. పాక్‌ జట్టులో స్నేహం ఉంటేనే ఎంపిక జరుగుతుందని విమర్శించారు. తీవ్ర విమర్శల గురించి తమకు పూర్తిగా తెలుసని... పరిధిలేని విమర్శలు ఆమోదయోగ్యమైనవి  కావని.. సద్విమర్శలపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పీసీబీ వర్గాలు తెలిపాయి. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ వంటి నిరాధార ఆరోపణలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించలేమని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. 

 

స్వదేశానికి కొందరే...

పొట్టి ప్రపంచకప్‌లో లీగ్‌ దశ నుంచే నిష్క్రమించిన తర్వాత పాక్‌ జట్టులోని కొందరు సభ్యులు ఒక ప్రైవేట్ విమానంలో పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. నసీమ్ షా, ఉస్మాన్ ఖాన్, సీనియర్ మేనేజర్ వహాబ్ రియాజ్ లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.  బాబర్ ఆజం, ఇమాద్ వసీం, హరీస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, ఆజం ఖాన్‌లతో సహా కొంతమంది సభ్యులు అమెరికాలోనే ఉన్నారు. వారు ఇవాళో రేపో పాక్‌కు చేరుకునే అవకాశం ఉంది.