IND vs BAN:  పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ఇండియా వ్యూహాలు పదేళ్ల క్రితం నాటివని మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ విమర్శించాడు. ఇలాంటి అప్రోచ్‌తోనే బంగ్లాదేశ్‌ చేతిలో వన్డే సిరీస్‌ చేజార్చుకున్నారని పేర్కొన్నాడు. భారత క్రికెట్‌ మరింత మెరుగవ్వాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని వెల్లడించాడు. శుక్రవారం వరుస ట్వీట్లు చేశాడు.


'ప్రపంచ వ్యాప్తంగా చాలా రంగాల్లో భారత్‌ సరికొత్త ఆవిష్కరణలు చేపడుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వచ్చేసరికి దశాబ్దాల క్రితం నాటి అప్రోచ్‌నే ఉపయోగిస్తున్నాం' అని వెంకటేశ్ ప్రసాద్‌ ట్వీట్‌ చేశాడు. '2015 ప్రపంచ కప్‌లో మొదటి రౌండ్లోనే వెనుదిరిగిన ఇంగ్లాండ్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. మార్పులు చేసుకొని ఓ అద్భుతమైన జట్టుగా మారింది. టీమ్‌ఇండియా ఇప్పుడు అలాంటి నిర్ణయాలే తీసుకోవాలి' అని అన్నాడు.






'టీమ్‌ఇండియా అప్రోచ్‌ విప్లవాత్మకంగా మారాల్సిన అవసరముంది. ఐపీఎల్‌ మొదలయ్యాక మనం టీ20 ప్రపంచకప్‌ గెలవనే లేదు. ఐదేళ్లుగా వన్డేల్లో మన ప్రదర్శన ఘోరంగా ఉంది. ప్రాముఖ్యం లేని ద్వైపాక్షిక సిరీసులు మాత్రమే గెలుస్తున్నాం. చాన్నాళ్లుగా మన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ అద్భుతమైన జట్టు అనిపించుకొనేందుకు చాలా దూరంగా ఉన్నాం. మార్పు అనివార్యం' అని వెంకటేశ్‌ ప్రసాద్‌ వరుస ట్వీట్లు చేశాడు.


బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొత్త ఛైర్మన్ గా భారత మాజీ ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన పేరును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా కొత్త సెలక్షన్ కమిటీ నియామకాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి చేపట్టనుంది. 


వెంకటేశ్ ప్రసాద్‌కు అంతర్జాతీయ  క్రికెట్లో అనుభవం ఉంది. ఫాస్ట్ బౌలర్ గా టీమిండియాకు ఆయన ఎన్నో సంవత్సరాలు సేవలు అందించారు. తన కెరీర్ లో 161 వన్డేలు ఆడిన ప్రసాద్ 196 వికెట్లు తీసుకున్నారు. అలాగే 33 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 96 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి ఆయన దరఖాస్తు సమర్పించారు. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.