Venkatesh Prasad: బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొత్త ఛైర్మన్ గా భారత మాజీ ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది. ఆయన పేరును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా కొత్త సెలక్షన్ కమిటీ నియామకాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి చేపట్టనుంది.
భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ అత్యంత అనుభవజ్ఞులైన క్రికెటర్లలో ఒకరు. ఫాస్ట్ బౌలర్ గా టీమిండియాకు ఆయన ఎన్నో సంవత్సరాలు సేవలు అందించారు. తన కెరీర్ లో 161 వన్డేలు ఆడిన ప్రసాద్ 196 వికెట్లు తీసుకున్నారు. అలాగే 33 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 96 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి ఆయన దరఖాస్తు సమర్పించారు. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.
కొత్త సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ను ప్రకటించే ముందు, వచ్చే వారం షార్ట్‌లిస్ట్ చేసిన క్రికెటర్లందరినీ సీఏసీ ఇంటర్వ్యూ చేస్తుంది. మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ కూడా ఈ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. అయితే చేతన్‌కు మళ్లీ అవకాశం ఇవ్వడంపై బీసీసీఐ, సీఏసీ సుముఖంగా లేరని తెలుస్తోంది.
ప్రస్తుతం వెంకటేశ్ ప్రసాద్ కామెంటేటర్ గా ఉన్నారు. అంతకుముందు ఒకసారి భారత ప్రధాన కోచ్ పదవికి ఆయన దరఖాస్తు చేశారు. అయితే కోచ్ కాలేకపోయారు.
టీమిండియా వన్డేలు ఆడే విధానం మారాలి
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ టీమ్‌ఇండియాకు పలు కీలక సూచనలు చేశాడు.
‘పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే విషయానికొస్తే భారత్ విధానం దశాబ్దం నాటిది. 2015 ప్రపంచకప్‌లో మొదటి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమణ తర్వాత ఇంగ్లండ్ కఠినమైన మార్పులు చేసింది. పటిష్టమైన జట్టుగా మారడానికి టీమ్‌ఇండియా కూడా కఠినమైన మార్పులు తీసుకు రావాల్సిన అవసరముంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి మనం (టీమ్‌ఇండియా) టీ20 ప్రపంచకప్ గెలవలేదు. గత 5 ఏళ్లలో వన్డేల్లో భారత్ కొన్నిసార్లు పేలవ ప్రదర్శనలు చేసింది. అయినా, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ఈ విధానం మారాలి’ అని వెంకటేష్ ప్రసాద్ సూచించాడు.