Watch Video: విరాట్ కోహ్లీ... సహచరులను ప్రోత్సహించడంలో, వారి విజయాలను తాను సెలబ్రేట్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు. తన తోటి ఆటగాడు సెంచరీ బాదినా అది తనే చేసినట్లు సంతోషపడిపోతాడు. వారికన్నా ముందే తను సంబరాలు చేసుకుంటాడు. ఇలాంటి సంఘటనే బంగ్లాదేశ్ - భారత్ మూడో వన్డేలో జరిగింది. ఇషాన్ కిషన్ ద్విశతకం సాధించాక అతనికన్నా ముందే విరాట్ సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు భాంగ్రా డ్యాన్స్ స్టెప్పులతో ఇషాన్ ను అభినందించాడు.
నిన్న జరిగిన బంగ్లా- భారత్ మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ముందు ఆచితూచి ఆడిన అతను.. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో అలరించాడు. బంగ్లా బౌలర్లను నిస్సహాయులను చేస్తూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో వేగవంతమైన ద్విశతకం (131 బంతుల్లో 210 పరుగులు) చేసిన ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు. అంతేకాదు ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్సుల్లో, అతి పిన్న వయసులో, అతి తక్కువ బంతుల్లో, ఒక్క సెంచరీ కూడా చేయకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఇషాన్ పలు మైలురాళ్లను అందుకున్నాడు.
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత తన 71వ శతకాన్ని అందుకున్నాడు. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానానికి చేరాడు. సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు.
విరాట్ భాంగ్రా డ్యాన్స్
అయితే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ అందుకున్నాక కోహ్లీ చేసిన పని వైరల్ అయ్యింది. 199 పరుగుల వద్ద ఉన్నప్పుడు ముస్తాఫిజర్ బౌలింగ్ లో సింగిల్ తీసి ఇషాన్ తన ద్విశతకాన్ని అందుకున్నాడు. ఇయితే ఇషాన్ కన్నా ముందే కోహ్లీ బ్యాట్ పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. అలాగే భాంగ్రా స్టెప్పులు వేస్తూ ఇషాన్ ను అభినందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఇంతే. తన సహచరుల విజయాలను వారికంటే ఎక్కువగా ఆస్వాదిస్తాడు. అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.