India vs Bangladesh 1st Test Day 3 :చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు పూర్తిగా భారత చేతుల్లోకి వచ్చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన టీమిండియా.. ఆ తర్వాత బంగ్లాను చుట్టేసింది. అనంతరం బంగ్లాకు ఫాలో ఆన్ ఆడే అవకాశం ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు... భారీ స్కోరు సాధించింది. రిషభ్ పంత్ మాస్ బ్యాటింగ్ కు... శుభ్ మన్ గిల్ క్లాస్ ఇన్నింగ్స్ తోడు కావడంతో భారత్ రెండో ఇన్నింగ్సులో కూడా భారీ స్కోరు చేసింది. పంత్, గిల్ శతక గర్జన చేయడంతో రెండో ఇన్నింగ్స్ ను నాలుగు వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని బంగ్లా దేశ్ ముందు భారత జట్టు 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.భారత బౌలర్లు రాణిస్తున్న వేళ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం బంగ్లాదేశ్ కు చాలా కష్టమే. ఇంకో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న వేళ ఫలితం రావడం అయితే ఖాయమే. అయితే బంగ్లాదేశ్ పోరాడుతుందా... లేదా భారత బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలుతుందా అన్నదే తేలాల్సి ఉంది.
పంత్ జోరు... గిల్ హుషారు
చెన్నై టెస్టులో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. 287 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. గిల్ 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కీపర్ బ్యాట్స్‌మెన్ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 128 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 19 బంతులు ఎదుర్కొని 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చేతులెత్తేసిన బంగ్లా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు భారత బౌలర్ల ధాటికి ఏమీ చేయలేకపోయారు. మెహదీ హసన్ మిరాజ్ 25 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా చెరో వికెట్ తీశారు.తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్.... ఈ కొండంత లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తుందేమో చూడాలి.
బుమ్రా-సిరాజ్ తో ముప్పే..
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. బుమ్రా 4 వికెట్లు తీశాడు. 11 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. ఆకాశ్ దీప్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా కూడా 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్లు లయ అందిపుచ్చుకున్న వేళ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం బంగ్లాదేశ్ కు అంత సులభం కాదు.