భారత క్రికెట్ జట్టు అభిమానులకు మరో షాక్. బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బంగ్లాదేశ్ 46 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక్కడ అన్నిటి కంటే బాధాకరమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ 136 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. కానీ టెయిలెండర్లు మెహదీ హసన్ మిరాజ్ (38 నాటౌట్: 39 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (10 నాటౌట్: 11 బంతుల్లో, రెండు ఫోర్లు) చివరి వికెట్‌కు 41 బంతుల్లోనే అజేయంగా 51 పరుగులు జోడించి బంగ్లాదేశ్‌ను గెలిపించారు. ఒక టెయిలెండర్ వికెట్‌ను భారత బౌలర్లు తీయలేకపోవడం అవమానకరం.


టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (27: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు ;ఒ క సిక్సర్), శిఖర్ ధావన్ (7: 17 బంతుల్లో, ఒక ఫోర్), విరాట్ కోహ్లీ (9: 15 బంతుల్లో, ఒక ఫోర్) ముగ్గురూ విఫలం కావడంతో టీమిండియా 11 ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 49 పరుగులు మాత్రమే.


ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (24: 39 బంతుల్లో, రెండు ఫోర్లు), కేఎల్ రాహుల్ (73: 70 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరు నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. భారత బ్యాటర్లలో కేవలం కేఎల్ రాహుల్ మాత్రమే రాణించాడు. మిగతా ఎవరూ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో భారత్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ ఐదు వికెట్లు తీయగా, ఎబాడట్ హొస్సేన్ నాలుగు వికెట్లు దక్కించుకున్నారు. మెహదీ హసన్‌కు ఒక వికెట్ దక్కింది.


అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ప్రారంభం అయింది. ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ శాంటోను (0: 1 బంతి) దీపక్ చాహర్ మొదటి బంతికే అవుట్ చేశాడు. అయితే మరో ఓపెనర్ లిట్టన్ దాస్ (41: 63 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్)రాణించాడు. ఒకానొక దశలో 128-4తో బంగ్లాదేశ్ సులభంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. అయితే భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా ఎనిమిది పరుగుల తేడాలోనే ఐదు వికెట్లు కోల్పోయింది.


కానీ ఆ తర్వాత మెహదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ పొరపాటు జరగనివ్వలేదు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీరు వేగంగా కూడా ఆడటం విశేషం. దీంతో బంగ్లాదేశ్ 46 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ సేన్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. శార్దూల్ ఠాకూర్‌కు ఒక వికెట్ దక్కింది.