IND vs BAN 1st ODI:  బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. బంగ్లా బౌలర్ల ధాటికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమయ్యారు. 41.2 ఓవర్లలో 186 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. కేఎల్ రాహుల్ అర్ధశతకంతో (73) రాణించాడు.  బంగ్లా బౌలర్లలో షకిబుల్ హసన్ 5 వికెట్లతో చెలరేగాడు. అబాడోట్ హొస్సేన్ 4 వికెట్లు తీశాడు. 


టాపార్డర్ టపటపా


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టాపార్డర్ తడబడింది. ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు నిదానంగా బ్యాటింగ్ చేశారు. రోహిత్ తనదైన శైలిలో దూకుడుగానే ఆడగా... ధావన్ నెమ్మదిగా ఆడాడు. ఉన్నంతసేపు ఇబ్బందిపడ్డ ధావన్ (7) స్పిన్నర్ మెహదీ హసన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ, రోహిత్ (27) ఇన్నింగ్స్ ను నడిపించారు. రోహిత్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టాడు. కోహ్లీ సింగిల్స్, డబుల్స్ రాబట్టాడు. క్రీజులో సౌకర్యంగా కదిలిన కెప్టెన్ షకీబుల్ హసన్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపాటు పడ్డాడు. దీంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో షకీబ్ భారత్ కు మరో షాక్ ఇచ్చాడు. బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్ కు కోహ్లీ (9) వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత ఇన్నింగ్స్ ను నడిపించే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లు తీసుకున్నారు. వీరిద్దరూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును నడిపించారు. శ్రేయస్ అయ్యర్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. అయితే కుదురుకున్నట్లే కనిపించిన ఈ జోడీని ఎబాడట్ హొస్సేన్ విడదీశాడు. షార్ట్ పిచ్ బంతిని షాట్ ఆడిన శ్రేయస్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 92 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. 


సుందర్- రాహుల్ ల భాగస్వామ్యం


శ్రేయస్ ఔటైన తర్వాత వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్- సుందర్ లు ఐదో వికెట్ కు 60 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి భాగస్వామ్యాన్ని షకీబ్ విడదీశాడు. షకీబ్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడిన సుందర్ (19) హొస్సేన్ కు చిక్కాడు. ఆ తర్వాత 35వ ఓవర్లో షకీబుల్ హసన్ భారత్ కు డబుల్ షాక్ ఇచ్చాడు. ఆ ఓవర్లో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లను ఔట్ చేశాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్(9) సాయంతో రాహుల్ స్కోరు బోర్డును నడిపించాడు. అయితే అబాడోట్ ఓ షార్ట్ పిచ్ బంతితో రాహుల్ ను బుట్టలో పడేశాడు. రాహుల్ ఔటయ్యాకు భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతోసేపు పట్టలేదు. 


ఐదేసిన షకీబ్


బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ 5 వికెట్లతో మెరిశాడు. కీలకమైన రోహిత్, కోహ్లీ వికెట్లతో పాటు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఢాకా మైదానంలో 84 మ్యాచులు ఆడిన ఈ ఆల్ రౌండర్ 124 వికెట్లు పడగొట్టాడు.