IND vs BAN 1st ODI: ఢాకా వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. 'మేం ముందు బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ మీద పచ్చిక ఉంది. తొలి 10 ఓవర్లు బౌలర్లకు సహకరించేలా కనిపిస్తోంది. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం' అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ అన్నాడు.
'మేం కూడా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లం. పిచ్ పై కొంత తేమ ఉంది. మా జట్టులో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంతమంది కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు. ఈరోజు మేం నలుగురు ఆల్ రౌండర్లతో బరిలోగి దిగుతున్నాం. కుల్దీప్ సేన్ అరంగేట్రం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.' అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్.
బంగ్లాదేశ్ తుది జట్టు
లిట్టన్ దాస్(కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్.
టీమిండియా నేటి నుంచి బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో మొదటి మ్యాచ్ ఆడబోతోంది. భారత్ కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. బంగ్లాకు లిటన్ దాస్ కెప్టెన్సీ చేయనున్నాడు.
న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న సీనియర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు ఈ సిరీస్ కు అందుబాటులోకి వచ్చారు. అలానే బంగ్లాతో వన్డే మ్యాచులకు టీం మేనేజ్ మెంట్ కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, కుల్దీప్ సేన్ లాంటి ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. సీనియర్లు, కుర్రాళ్ల మేళవింపుతో భారత్ కాగితంమీద బలంగా కనిపిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ నకు సన్నాహకంగా ఈ మ్యాచులను ఉపయోగించుకోనున్నారు. మరి అందులో ఎంతమేర సఫలీకృతమవుతారో చూడాలి.
బంగ్లా ప్రమాదమే
సొంత గడ్డపై బంగ్లాదేశ్ ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. వన్డేల్లో ఆ జట్టుకు మంచి ఆటగాళ్లు ఉన్నారు. అయితే కెప్టెన్ గా ఎంపికైన తమీమ్ ఇక్బాల్, ఫామ్ లో ఉన్న బౌలర్ తస్కిన్ అహ్మద్ లు దూరమవడం ఆ జట్టుకు లోటే. తమీమ్ స్థానంలో లిటన్ దాస్ బంగ్లా జట్టును నడిపించనున్నాడు. అతను మంచి టచ్ లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ లో భారత్ పై లిటన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ను టీమిండియా అభిమానులు అంత త్వరగా మరచిపోలేరు. దాస్ తో పాటు అనాముల్ హక్, షకీబుల్ హసన్, ముష్పికర్ రహీం, మహమ్మదుల్లా, ఆఫిఫ్ హొస్సేన్, నురుల్ హసన్ లాంటి బ్యాట్స్ మెన్ తో బలంగానే ఉంది. అలాగే బౌలింగ్ లో ముస్తాఫిజర్ రెహ్మాన్, హసన్ మహమూద్, హసన్ అలీ లాంటి మంచి బౌలర్లు ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు.
తమదైన రోజున ఎంత బలమైన జట్టునైనా మట్టికరిపించడం బంగ్లాదేశ్ నైజం. కాబట్టి టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సిందే.