World Cup Final 2023: 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఎందరో నాయకులు తమ జట్టును విశ్వ విజేతలను చేశారు. క్లిష్ట సమయాల్లో జట్టుకు మార్గనిర్దేశనం చేసి టీంను తుది పోరులో గెలిపించి జగజ్జేతలుగా నిలిచారు. ఇప్పటివరకూ జరిగిన 12 ప్రపంచకప్‌లో కేవలం 10 మంది మాత్రమే ఈ అరుదైన ఖ్యాతిని సంపాదించారు. అందుకే వన్డే ప్రపంచకప్‌ అంటే అంత తేలిక కాదు. దేశానికి వన్నె తెచ్చే ప్రపంచకప్‌ను గెలిచి తమ దేశానికి... క్రికెట్‌కు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన కెప్టెన్లు వీరే...

 

1975, 1979 ప్రపంచకప్‌... క్లైవ్‌ లాయిడ్‌

1975లో వన్డే ప్రపంచకప్‌ తొలిసారి ప్రారంభమైంది. అప్పటికి వెస్టిండీస్‌ జట్టంటే ప్రత్యర్థి జట్లు భయంతో వణికిపోయేవి. క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్‌ అయినా.. మొట్ట మొదటి వన్డే వరల్డ్‌కప్‌ సాధించి విండీస్‌ తన పేరును సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించుకుంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను ఓడించి తొలిసారి విశ్వ విజేతగా అవతరించింది. మొట్టమొదటి ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడి తమ దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా చేసింది. కెప్టెన్‌ సర్‌ క్లైవ్‌ లాయిడ్‌ ఫైనల్లో సెంచరీ చేసి క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును కాపాడాడు. లాయిడ్‌ 85 బంతుల్లో 102 పరుగులు సాధించి విండీస్‌కు తొలి ప్రపంచకప్‌ అందించాడు. శతక వీరుడు విండీస్‌ కెప్టెన్‌ సర్‌ క్లైవ్‌ లాయిడ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా తొలి ప్రపంచకప్‌లో తనదైన ముద్ర వేశాడు. 1979లోనూ లాయిడ్‌ మరోసారి తన జట్టును విశ్వవిజేతగా నిలిచి తిరుగులేని కెప్టెన్‌గా ఖ్యాతిని మూటగట్టుకున్నారు.

 

1983 ప్రపంచకప్‌... కపిల్‌ దేవ్‌

అస్సలు అంచనాలే లేకుండా 1983 ప్రపంచకప్‌ బరిలోకి దిగిన టీమిండియా కప్పు గెలిచిందంటే దానికి కర్త, కర్మ, క్రియ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అంచుల నుంచి జట్టును రక్షించి..175 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడిపించాడు. ఆటగాళ్లల్లో స్ఫూర్తిని నింపుతూ కపిల్‌ తొలిసారి భారత్‌ను విశ్వ విజేతగా నిలిపాడు. ఆ తర్వాత భారత్‌లో క్రికెట్‌ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అందుకే కెప్టెన్‌గా కపిల్ ఎవర్‌గ్రీన్‌.. ఓ లెజెండ్‌.

 

1987 ఆస్ట్రేలియా.. అలెన్‌ బోర్డర్‌

భారత, పాకిస్తాన్‌ సంయుక్తంగా నిర్వహించిన 1987 వన్డే ప్రపంచకప్‌ నుంచి క్రికెట్‌లో ఆస్ట్రేలియా యుగం ప్రారంభమైంది. కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌ తొలిసారి కంగారులను విశ్వ విజేతలుగా నిలిపాడు. ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ఆటగాళ్లను సమర్థంగా వినియోగించుకుంటూ ఈ కప్పును ఆస్ట్రేలియాకు అందించాడు.

 

1992 పాకిస్థాన్‌.. ఇమ్రాన్‌ ఖాన్‌

1992లో పాకిస్తాన్ జట్టు తమ తొలి, ఏకైక వరల్డ్ కప్ గెలుచుకుంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా మరో ట్రోఫీ లేదు. కానీ 1992లో పాకిస్తాన్ ఆడిన తీరు నభూతో నభవిష్యత్ అనే చెప్పుకోవాలి. ఇమ్రాన్‌ఖాన్‌ సారధ్యంలో పాక్‌ అంచనాలే లేని స్థితి నుంచి ఛాంపియన్‌గా అవతరించింది. ప్రతీ మ్యాచ్‌లోనూ ఇమ్రాన్‌ అద్భుత బౌలింగ్‌తో.. ప్రత్యర్థులకు అంతుచిక్కని వ్యూహాలతో మలుపుతిప్పాడు. ఆ ప్రపంచకప్ పాక్‌ గెలిచిందంటే అది ఇమ్రాన్‌ఖాన్‌ సారథ్యం వల్లే. 

 

1996 శ్రీలంక.. అర్జున రణతుంగ

శ్రీలంక క్రికెట్‌లో అత్యంత విజయవంతైన కెప్టెన్‌ అర్జున రణతుంగ. సాహసోపేతమైన 

నిర్ణయాలకు రణతుంగా పెట్టింది పేరు. 1996లో ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి రణతుంగా తొలిసారి లంకేయులను విశ్వ విజేతలను చేశాడు. ఆ తర్వాత మరెవరికీ ఈ ఘనత సాధ్యం కాలేదు. 

 

1999, 2003, 2007 ఆస్ట్రేలియా.. స్టీవ్‌ వా, పాంటింగ్‌

1999 నుంచి 2007 వరకు జరిగిన వన్డే ప్రపంచకప్‌లను వరుసగా సాధింటి ఆస్ట్రేలియా హ్యాట్రిక్‌ కొట్టింది. 1999లో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ స్టీవ్‌ వా రెండోసారి కంగారులకు వరల్డ్ కప్ప్ అందించాడు. తర్వాత 2003లో రికీ పాంటింగ్‌ సారధ్యంలో కంగారులు జగజ్జేతలుగా నిలిచారు. 2003లో భారత్‌తో జరిగిన ఫైనల్లో పాంటింగ్‌ భారీ శతకంతో భారత ఆశలపై నీళ్లు పోశాడు. 2007లోనూ మరోసారి పాంటింగ్‌ సారథ్యంలో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది.
  

 

2011 టీమిండియా.. ‍ధోని

28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణను బద్దలు కొడుతూ మహేంద్ర సింగ్‌ ధోనీ టీమిండియాకు వన్డే ప్రపంచకప్‌ను అందించాడు. ధోని ప్రశాంత కెప్టెన్సీ టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించింది. కేవలం ధోనీ వల్లే ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ఆడి కప్పును గెలిచారు. ఫైనల్లో శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత అభిమానుల్లో ధోనీ అసలుసిసలైన నాయకుడిగా గుర్తింపు పొందాడు. క్రికెట్‌ నుంచి రిటైరైన ఇప్పటికీ కెప్టెన్సీ అంటే ధోని పేరే వినపడుతుంది.

 

2015 ఆస్ట్రేలియా ప్రపంచకప్‌-- మైఖేల్‌ క్లార్క్‌

2015లో ఆస్ట్రేలియా అయిదో సారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. మైఖేల్‌ క్లార్క్‌ సారథ్యంలోని జట్టు జగ్గజ్జేతగా నిలిచింది. 2015లో ప్రపంచకప్ ఫైనల్ మెల్‌బోర్న్‌లో జరగ్గా.. ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. స్వదేశంలో జరిగిన ఈ ప్రపంచకప్‌లో క్లార్క్‌ జట్టును ముందుండి నడిపించాడు. 

 

2019 ఇంగ్లండ్‌... ఇయాన్‌ మెర్గాన్

క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ అందించిన వీరుడిగా ఇయాన్ మోర్గాన్‌ ఎనలేని ఖ్యాతి గడించాడు. 1975 నుంచి ప్రపంచకప్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న బ్రిటీష్‌ జట్టుకు తొలిసారి మోర్గాన్‌ కప్పు అందించి విశ్వ విజేతలుగా నిలిపాడు. మోర్గాన్‌ సారథ్యంలో ఇంగ్లండ్ 2019 ప్రపంచకప్‌లో అద్భుతంగా పోరాడింది. జట్టులోని సభ్యులకు మార్గనిర్దేశం చేస్తూ మోర్గాన్‌ గొప్ప సారధిగా పేరు తెచ్చుకున్నాడు.