IND vs AUS, WC Final 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్(World Cup 2023)లో భారత్(Bharat) మహా సంగ్రామానికి సిద్ధమైంది. పుష్కర కాలం తర్వాత టీమిండియా ఫైనల్ చేరి... కప్పు కలను సాకారం చేసేందుకు కేవలం ఒక్క అడుగుదూరంలో నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టు.. అప్రతిహాత విజయాలతో ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్(New Zeland)ను చిత్తుచేసి 2019 సెమీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా(Austrelia) వంతు వచ్చింది. 2003 ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి.. తమకు కప్పు కలను దూరం చేసిన ఆవేదనకు ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేన సిద్ధమైంది. అన్ని విభాగాల్లో దుర్బేధ్యంగా రోహిత్ సేన... ఇక ఆస్ట్రేలియాపై విజయం సాధించడం ఒక్కటే మిగిలింది. అయితే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఏం చేయాలో తమకు బాగా తెలుసని ఆత్మ విశ్వాసంతో ప్రకటించాడు.
తాను సారధిగా ఉన్నప్పటి నుంచి ఈరోజు కోసమే ఎదురుచూశానని రోహిత్ శర్మ అన్నాడు. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించామని.. ఇప్పుడు ఆ సన్నాహాలను పకడ్బందీగా మైదానంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందని రోహిత్ అన్నాడు. జట్టులో ఉన్న ప్రతీ ఆటగాడికి అతడి పాత్రపై స్పష్టమైన అవగాహన ఉందని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఇప్పటివరకు తాము మెరుగైన ప్రదర్శన కనబరిచామని... ఇవాళ కుడా అదే జోరు కొనసాగిస్తామని రోహిత్ అన్నాడు. ఆస్ట్రేలియాను తేలికగా తీసుకోబోమని, ప్రపంచక్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో ఆస్ట్రేలియా ఒకటని తమకు బాగా తెలుసని రోహిత్ అన్నాడు. ఈ టోర్నీలో వరుసగా 8 కి ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు వచ్చిందని.. ఆస్ట్రేలియా ఏమి చేయగలదో తమకు తెలుసని టీమిండియా సారధి అన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని విధాల సిద్ధమయ్యామని కూడా రోహిత్ తెలిపాడు.
ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నా.... తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని... వాటిపైనే తాము దృష్టి పెడతామని రోహిత్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఫామ్‌ను చూసి తాము ఆందోళన చెందడం లేదని... తమపై చాలా అంచనాలు ఉన్నాయని కూడా తమకు తెలుసని రోహిత్ అన్నాడు. ఒత్తిడిని తట్టుకుని ఎలా ఆడాలో తమకు బాగా తెలుసన్న రోహిత్ శర్మ.... డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా తాము ప్రశాంతమైన వాతావారణం ఏర్పరుచుకున్నామని తెలిపాడు. ఈ టోర్నీలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారని కూడా రోరిద్ గుర్తు చేశాడు. బుమ్రా, షమీ, సిరాజ్ కొత్త బంతితో అద్బుతాలు చేయగా.. మిడిల్ ఓవర్లలో స్నిన్నర్లు కూడా అత్యుత్తమంగా రాణించారని రోహిత్ గుర్తు చేశాడు.
ఈ ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో టాస్ కీలక పాత్ర పోషించింది. అయితే ఫైనల్ జరిగే అహ్మదాబాద్(Ahmadabad)లో జరిగిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లో మూడుసార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. పాకిస్థాన్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ టార్గెట్‌ను సునాయసంగా ఛేదించి విజయం సాధించింది. ఈసారి కూడా టాస్ గెలిస్తే రోహిత్ బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే టోర్నీలో మెజారిటీ మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేసి కూడా టీమిండియా గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధింటి కంగారులపై ఒత్తిడి పెంచాలని వ్యూహాన్ని కూడా రచించి ఉండవచ్చు.