World Cup Final 2023: భారత్‌(India) వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌(World Cup) తుది అంకానికి చేరుకుంది.  నేడు జరగనున్న  ఫైనల్‌తో ఈ మహా సంగ్రామం ముగియనుంది. అప్రతిహాత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో(Austrelia) అమీతుమీ తేల్చుకోనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న టీమ్‌ ఇండియా చివరి అడుగు వేసి ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్‌తో అదరగొడుతుంటే... బౌలర్లు పదునైన బంతులతో బెదరగొడుతున్నారు. టీమిండియా విజయం కోసం 130 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2011 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యులైన విరాట్ కోహ్లి, అశ్విన్‌ మరోసారి  ఆ అనుభూతిని పొందాలని పట్టుదలతో ఉన్నారు. ఏమాత్రం ఎమరుపాటు లేకుండా.. ముచ్చటగా మూడోసారి కప్పును గెలిచేందుకు రోహిత్‌ సేన సిద్ధంగా ఉంది. ఫైనల్‌లో టీమిండియా గెలవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. 



 ఈ నేపథ్యంలో ఫైనల్‌కు కొన్నిగంటల ముందు ఆస్ట్రోటాక్ (Astro Talk) సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. భారత్‌ గెలవాలని కోరుకుంటూ తమ కస్టమర్లకు ఆస్ట్రాలజీ కంపెనీ సీఈవో సీఈవో పునీత్‌ గుప్తా ఓ బంపరాఫర్‌ ప్రకటించారు. ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే రూ.100కోట్లు పంచుతానని తెలిపారు. ఫైనల్లో భారత్ గెలిస్తే తమ కంపెనీ వినియోగదారులకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 2011లో టీమిండియా ప్రపంచకప్ గెలిచిన సమయంలో తాను కాలేజీలో చదువుకుంటున్నానని.. తన జీవితంలో అత్యంత ఆనందక్షణాల్లో అదొకటని పునీత్ గుప్తా గుర్తు చేసుకున్నారు. ఆ రోజు రాత్రంతా మ్యాచ్ గురించే మాట్లాడుకున్నామని.. మ్యాచ్‌లో మన జట్టు వ్యూహం గురించే చర్చించుకున్నామని నెమరు వేసుకున్నారు. 2011లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత తన ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయని పునీత్‌ గుప్తా చెప్పారు. 



ఈసారి భారత్‌ గెలిస్తే ఏం చేయాలా? అని తాను చాలాసేపు ఆలోచించానని, అప్పుడు నా ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారని, కానీ, ఇప్పుడు మా ఆస్ట్రోటాక్‌ యూజర్లంతా తన స్నేహితులే అని గుప్తా వెల్లడించారు. వారితో కలిసి తన ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నానని... భారత్‌ ప్రపంచకప్‌ను ముద్దాడితే తమ సంస్థ యూజర్లందరికీ రూ.100కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నానని పునీత్‌ గుప్తా సంచలన ప్రకటన చేశారు.



 దేశం మొత్తం క్రికెట్‌ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు ధరించి... వారి ఫోటోలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. టీమిండియా స్టార్‌ క్రికెటర్ల ఫొటోలకు వీర తిలకం దిద్ది పూజలు చేస్తున్నారు. చెన్నైలోని క్రికెట్ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రికెట్ గణనాథుడు 11 తలల విగ్రహరూపంలో ఉండి జట్టులోని 11 మంది క్రికెటర్లను ప్రతిబింభిస్తాడని అభిమానుల విశ్వాసం. ఈ గుడిని క్రికెట్ ప్రేమికులు నిర్మించారు. ఈ దేవాలయంలో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్లు, బౌలింగ్ వేస్తన్నట్లు వివిద భంగిమల్లో వినాయుకుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. క్రికెట్ అభిమానులు భారత్ జట్టు గెలవాలని ఇక్కడ భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అహ్మదాబాద్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై టీంఇండియా గెలవాలని అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు, హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు.