World Cup Final 2023: ఇప్పుడు క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ భారత్‌-ఆస్ట్రేలియా(India vs Australia)  ఫైనల్‌ మ్యాచ్‌పైనే ఉన్నాయి. పుష్కర కాలం తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను(Austrelia) చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్పును ఒడిసిపట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్‌ పిచ్‌(Ahamadabad pitch)పై ఇప్పటికే లీగ్‌ మ్యాచ్‌లో కంగారులను మట్టికరిపించిన రోహిత్‌ సేన మరోసారి ఆ ఫలితాన్నే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. అయితే వాంఖడే (Wankhede Stadium)లో తాజా పిచ్‌ వినియోగించకుండా ఆడిన పిచ్‌పైనే సెమీస్‌ నిర్వహించడంపై విమర్శలు వచ్చిన వేళ ఇప్పుడు అహ్మదాబాద్‌ పిచ్‌ ఎలా ఉంటుందన్న దానిపై చర్చలూ ఊపందుకున్నాయి. అహ్మదాబాద్‌ పిచ్‌ను పరిశీలించిన తర్వాత అది బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా... బౌలింగ్‌కు అనుకూలిస్తుందా టాస్‌ గెలిస్తే ఏం తీసుకుంటే మంచిదనే దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలోని మొత్తం 11 పిచ్‌లు ఉన్నాయి. ఇవి చాలా భిన్నంగా ఉంటాయి. అయిదు పిచ్‌లను నల్లమట్టితో తయారు చేయగా... మిగిలిన ఆరు పిచ్‌లను ఎర్రమట్టితో తయారు చేశారు. ఫైనల్‌కు ఎంపిక చేసే పిచ్‌ నలమట్టిదే అని తేలిపోయింది. నల్లమట్టి పిచ్‌లపై స్పిన్‌కు ఉపయుక్తంగా ఉంటుంది.



కాబట్టి ఈ ఫైనల్‌ మ్యాచ్‌ నల్లమట్టి పిచ్‌పైనే జరిగే అవకాశముంది. స్పిన్‌కు అనుకూలించే వికెట్‌ సిద్ధం చేశారనే వార్తలు బలంగా వస్తున్నాయి. వికెట్‌ కనుక స్పిన్‌కు అనుకూలిస్తే టీమిండియాది ఒకింత పైచేయి కానుంది. అయితే పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తే తుది జట్టులోకి మహ్మద్‌ సిరాజ్‌ స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకుంటారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు  సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అశ్విన్‌కు ఛాన్స్ ఇవ్వాలని కొంతమంది సూచిస్తున్నారు.


ఈ నేపథ్యంలో తుది జట్టులోకి అశ్విన్‌ను తీసుకునే అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మ్యాచ్‌కు ముందు జరిగే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రోహుత్‌.. రవిచంద్రన్ అశ్విన్ ఎంపికై నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. మొత్తం పదిహేను మందికీ జట్టులో ఆడే అవకాశం ఉంటుందన్న రోహిత్‌ శర్మ.... పిచ్ పరిస్థితులను ఇవాళ కూడా అంచనా వేసి తుది జట్టుపై అంచనాకు వస్తామని తెలిపాడు. 12 నుంచి 13 మంది ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని... అయితే జట్టులో 11 మందికి మాత్రమే స్థానం ఉంటుందని గుర్తు చేశాడు. మొత్తం 15 మంది ఆటగాళ్లు మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉండమని ఇప్పటికే చెప్పామని రోహిత్ శర్మ వెల్లడించాడు.ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడాలనేది ప్రతి క్రీడాకారుడి కలగా పేర్కొన్న రోహిత్ శర్మ.. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ మైదానంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్క బ్యాటర్‌కు హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉందన్న రోహిత్ శర్మ.. అయితే ప్రతి ఆటగాడికి తాము కొన్ని బాధ్యతలు అప్పగించినట్లు చెప్పుకొచ్చాడు.


ఈడెన్‌గార్డెన్స్‌లో సౌతాఫ్రికాతో జరిగిన సెమీ్‌సలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఆసీస్‌ బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. ఆసిస్‌లో బలమైన స్పిన్నర్లు లేకపోవడం టీమిండియాకు బలంగా మారనుంది. ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు వారు న్యాయం చేస్తే విజయం తమదేనని రోహిత్‌ ధీమా వ్యక్తం చేశాడు.