Pat Cummins Mother Death:


ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి మరియా కమిన్స్‌ ఇక లేరు. సుదీర్ఘ కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మధ్యే ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఆమె మరణించారని క్రికెట్‌ ఆస్ట్రేలియా శుక్రవారం వెల్లడించింది. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. అహ్మదాబాద్ టెస్టు రెండో రోజు ఆసీస్‌ క్రికెటర్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరించి ఆడుతున్నారు.


దిల్లీ టెస్టు ఓడిపోయిన వెంటనే ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummings) సిడ్నీకి వెళ్లిపోయాడు. అనారోగ్యానికి గురైన అతడి తల్లిని చూసుకుంటున్నాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఇండోర్‌ టెస్టు ఆడేందుకు అతడు రిటర్న్‌ టికెట్‌ సైతం బుక్‌ చేసుకున్నాడు. మ్యాచ్‌ ముందు ఆదివారం రావాలనుకున్నాడు. ఇంతలోనే తన నిర్ణయం మార్చుకున్నాడు. కొన్ని రోజులు కుటుంబంతోనే ఉంటున్నాడు.




'భారత్‌కు తిరిగి రావాలన్న నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నా కుటుంబంతో ఉండటమే మంచిదని అనిపించింది. నాకు అండగా నిలిచిన క్రికెట్‌ ఆస్ట్రేలియా, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు. నన్ను అర్థం చేసుకొన్నందుకు కృతజ్ఞతలు' అని కమిన్స్‌ గతంలో ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.


'గురువారం అర్ధరాత్రి మరియా కమిన్స్‌ మరణించడం మమ్మల్ని విషాదంలోకి నెట్టేసింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ తరఫున ప్యాట్‌ కమిన్స్‌, వారి కుటుంబం, స్నేహితులకు బాధతప్త హృదయంతో సానుభూతి ప్రకటిస్తున్నాం. మరియాకు గౌరవంగా నేడు ఆస్ట్రేలియా క్రికెటర్లు భుజాలకు నల్లని బ్యాండ్లు ధరిస్తారు' అని క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్వీట్‌ చేసింది.


బీసీసీఐ సైతం మరియా కమిన్స్‌ మరణం పట్ల సంతాపం తెలిపింది. 'భారత క్రికెట్‌ తరఫున ప్యాట్‌ కమిన్స్‌ మరణానికి సంతాపం ప్రకటిస్తున్నాం. ఈ సంక్లిష్ట సమయంలో మా ఆలోచనలన్నీ అతడి వెంటే ఉన్నాయి' అని ట్వీట్‌ చేసింది.


మరియా కమిన్స్‌కు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్టు 2005లో తెలిసింది. ఈ మధ్య కాలంలో ఆమె మరో సుదీర్ఘ వ్యాధితో బాధపడ్డారు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారు. ప్రాణ వాయువు సాయంతో వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆమె మరణించారని ప్రకటించారు.