Delhi Capitals Women vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదటి ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్లలో యాస్తిక భాటియా (41: 32 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.


ఈ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా మూడో విజయం. ఢిల్లీకి మొదటి పరాజయం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తన మొదటి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఢిల్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.


ఆడుతూ, పాడుతూ ఛేదించిన ముంబై
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు యాస్తిక భాటియా (41: 32 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), హేలీ మాథ్యూస్ (32: 31 బంతుల్లో, ఆరు ఫోర్లు) సూపర్ స్టార్ట్ ఇచ్చారు. వీరిద్దరి బ్యాటింగ్‌తో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. ఈ జోడి మొదటి వికెట్‌కు 65 పరుగులు జోడించింది. కొట్టాల్సిన స్కోరు తక్కువే కావడంతో నెట్ రన్ రేట్ పెంచుకోవడానికి వీరు బౌండరీలతో చెలరేగి ఆడారు. కేవలం 8.5 ఓవర్లలో వీరు ఈ భాగస్వామ్యాన్ని అందించారు.


ఆ తర్వాత వీరిద్దరూ తక్కువ వ్యవధిలోనే అవుట్ అయినా వన్ డౌన్‌లో వచ్చిన నాట్ స్కివర్ బ్రంట్ (23: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (11: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) కలిసి 15 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు. ముంబై బౌలర్లలో అలీస్ క్యాప్సీ, టారా నోరిస్‌లకు చెరో వికెట్ దక్కింది.


టాస్ గెలిచినా బోల్తా పడి
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్లోనే ఢిల్లీకి ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ షెఫాలీ వర్మ (2: 6 బంతుల్లో) సైకా ఇషాక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత వచ్చిన అలీస్ క్యాప్సే (6: 7 బంతుల్లో), మారిజానే క్యాప్ (2: 4 బంతుల్లో) విఫలం అయ్యారు. దీంతో 31 పరుగులకే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (25: 18 బంతుల్లో, మూడు ఫోర్లు), ఓపెనర్ మెగ్ లానింగ్‌తో (43: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచింది. వీరిద్దరూ బౌండరీలతో స్కోరు వేగాన్ని కూడా పెంచారు. మెగ్ లానింగ్ మొదట నిదానంగా ఆడినా క్రమంగా తను కూడా జోరు పెంచింది. అయితే సైకా ఇషాక్ ఢిల్లీకి మరోసారి షాక్ ఇచ్చింది. క్రీజులో కుదురుకున్న జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్ ఇద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసింది.


ఆ తర్వాతి ఓవర్లోనే జొనాసెన్ (2: 3 బంతుల్లో), మిన్ను మణిలను (0: 3 బంతుల్లో) హేలీ మాథ్యూస్ అవుట్ చేసింది. దీంతో ఢిల్లీ 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన వారు కూడా త్వరగానే అవుట్ అయిపోయారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది.