Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ ప్రజలకు రూ. లక్షలు ఇచ్చే పథకాల విషయంలో కీలక నిర్ణయాలుతీసుకుంది. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకోలేని పేదలకు.. ఆర్థిక సాయం చేస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను హరీష్ రావు మీడియాకు వివరించారు. ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించామని హరీష్ రావు తెలిపారు.
సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి రూ. మాడు లక్షలు !
మొత్తం 43వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో పెట్టాలని ... నాలుగు లక్షల ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఇండ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని తీర్మానించారు. ఈ రూ.3లక్షలను మూడు దఫాలుగా ఇస్తారు. ఒక్కో దఫాలో రూ.లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారుడు తన ఇంటిని తనకు నచ్చిన విధంగా కట్టుకునే విధంగా నిబంధనలను సులభతరం చేస్తారు. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని, ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని హరీష్ రావు ప్రకటించారు. మంజూరు చేసే ఇండ్లన్నీ ఆ ఇంటికి సంబంధించిన మహిళలపైనే ఇస్తారు. గత కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో ఇచ్చిన ఇళ్లకు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.4వేలకోట్లు పేదలపై అప్పులుంటే.. ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నదని హరీష్ రావు ప్రకటించారు.
మరో లక్షా 30వేల మందికి దళిత బంధు
అలాగే దళిత బంధు పథకాన్ని మరింత చురుగ్గా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడుతలో పలు నియోజకవర్గాల్లోని లబ్ధిదారులకు యూనిట్లు అందజేయగా.. త్వరలో రెండో విడత ప్రక్రియను చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దళితబంధులో 1.30 లక్షల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని హుజూరాబాద్‌లో వందశాతం లబ్ధిదారులకు అందించామని... మిగతా 118 నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధును రెండో విడతలో అందించాలని నిర్ణయం తీసుకున్నామని హరీష్ రావు తెలిపారు. 118 నియోజకవర్గాల్లోని 1,29,800 మంది లబ్ధిదారులకు అందించనుండగా.. మరో 200 మందికి చీఫ్ సెక్రెటరీ నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేయనున్నామన ితెలిపారు. మొత్తం 1.30లక్షల మందికి అందిస్తామని హరీష్ రావు ప్రకటించారు.
పోడు భూముల పంపిణీకి నిర్ణయం
ఇక పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో 58,59, దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ, కాశీ, శబరిమలలో రూ. 25 కోట్ల చొప్పున నిధులతో వసతి గృహాల ఏర్పాటు తదితర అంశాలపై కేబినెట్ లోతైన చర్చ జరిపి, నిర్ణయాలు తీసుకున్నట్లుగా హరీష్ రావు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో నాలుగున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కు ఈడీ ఇచ్చిన నోటీసులపై కూడా చర్చించినట్లుగా తెలు్సతోంది. మార్చి 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత తలపెట్టిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు సాధించడం కోసం ధర్నా’ కార్యక్రమానికి మద్దతు తెలపడం కోసం మహిళా మంత్రులు ఢిల్లీ వెల్లారు. మరికొందరు మంత్రులు వెళ్లనున్నారు.
అసెంబ్లీ ఆమోదించిన పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.