BJP On KTR Kavitha  :   ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ టార్గెట్ చేస్తున్నారని.. అన్నా చెల్లెళ్లు అంటున్నారని.. మోడీ టార్గెట్ చేసేంత గొప్ప కుటుంబం, మనుషులు అయితే కాదని  కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  మీకు మీరుగా కేసులో ఇరుక్కుని బీజేపీపై అభాండాలు వేస్తున్నారని.. ఫోన్లు పగలగొట్టింది ఎవరు అని ప్రశ్నించారు . ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎవరు తలదూర్చారు.. ఎవరు మార్చారు.. ఎవరు స్పెషల్ ఫ్లయిట్స్ లో వెళ్లారు.. ఎవరు డబ్బులు సంపాదించారని కిషన్ రెడ్డి  ప్రశ్నించారు. నోరు తెరిస్తే అబద్దాలు.. నిజం మాట్లాడమే తెలియదని..  వాళ్లకు వాళ్లు గొప్పోళ్లుగా ఊహించుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే పని చేసిన కవిత.. రాజకీయ వేధింపులు అని మాట్లాడటం సిగ్గు చేటన్నారు.                                         

  


మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికిక లేదన్నారు.  కేసీఆర్ కుటుంబానికి ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం ఉండదని..   మద్యం కేసు బయట పడగానే మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా అని కవితను ప్రశ్నించారు.   తెలంగాణలో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలించిన మీకు.. రిజర్వేషన్ల గురించి అడిగే హక్కు ఉందా అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మీరు ఢీల్లీకి వెళ్లి అక్రమ మద్యం వ్యాపారం చేయాలని తెలంగాణ సమాజం చెప్పిందా అని ఆయన ప్రశ్నించారు.         


బీజేపీ కక్ష సాధింపులకు పాల్ప డుతోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని మరో బీజేపీ నేత డీకే అరుణ అన్నారు.  కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం వెనుక కక్ష సాధింపులు లేవని చెప్పారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని... అధికారంలోకి వచ్చిన వెంటనే అందరిపై కక్ష సాధింపులకు దిగిన కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి అందరూ అలాగే చేస్తున్నట్టు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అరెస్ట్ అయిన వారు పదేపదే కవిత పేరును ఎందుకు చెపుతున్నారని అరుణ ప్రశ్నించారు. ఈడీ విచారణలో కవిత ఆమె నిజాయతీని నిరూపించుకోవచ్చని చెప్పారు. 


కేసీఆర్ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడం అలవాటని విమర్శించారు. లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారణకు పిలిస్తే... మొత్తం తెలంగాణ సమాజాన్నే అవమానిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ నుంచి నోటీసులు వస్తాయని ముందస్తు సమాచారం ఉండటం వల్లే... మహిళా రిజర్వేషన్లు అంటే కొత్త డ్రామాకు తెరతీశారని అనిపిస్తోందని చెప్పారు.