Rajamahendravaram Blade Batch News: బ్లేడ్‌బ్యాచ్‌ గురించి మీకు తెలుసా అని ఎవ్వరిని అడిగినా.. ఠక్కున చెప్పే సమాధానం ఒక్కటే రాజమండ్రి లో కదా అంటారు. అవును మరి అంతలా బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలు ఉండేవి. అయితే తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జ్‌ ఎస్పీగా సుధీర్‌కుమార్‌ రెడ్డి బాద్యతలు స్వీకరించాక బ్లేడ్‌ బ్యాచ్‌లపై ఉక్కుపాదం మోపారు. ఇటీవల కాలంలో బ్లేడ్‌ బ్యాచ్‌ల ఆగడాలపై నిఘా పెట్టిన పోలీసులు పదుల సంఖ్యలో బ్లేడ్‌గాళ్లను గుర్తించి కేసులు నమోదుచేసి జైలుకు పంపారు. దీంతో బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలు చాలావరకు అదుపులోకి వచ్చాయి. 
వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనలు
అంతా ప్రశాంతంగా ఉందన్న సమయంలో వరుస బ్లేడ్‌బ్యాచ్‌ దాడులు అంటూ వారం రోజుల వ్యవధిలో మూడు సంఘటనలతో మరోసారి రాజమండ్రి ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. అంతా తూచ్‌.. బ్లేడ్‌ బ్యాచ్‌ దాడులు కాదు తమకుతామే బ్లేడ్లతో కోసుకుని డబ్బులు యజమానులకు డబ్బులు ఎగ్గొట్టేందుకు ఆడిన నాటకమని తేలిపోయింది. దీంతో వారిపై కేసులు నమోదు చేసి పుండుమీద కారం చల్లారు. ఈ విషయాలన్నీ తూర్పు గోదావరి జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర రావు వెల్లడించారు. 


యజమాని డబ్బులు ఎగ్గొట్టేందుకు ఖతర్నాక్‌ ప్లాన్‌..
రాజమండ్రికి ఇందిరా నగర్‌కు చెందిన పువ్వల పవన్‌కుమార్‌ అను తనపై నలుగురు బ్లేడ్‌ బ్యాచ్‌ దాడిచేసి తనవద్దనున్న రూ.30వేలు లాక్కుని పోయినట్లు ఈనెల ఏడో తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేసిన పోలీసులకు పవన్‌కుమార్‌ అల్లిన ఖతర్నాక్‌ ప్లాన్‌ బట్టబయలయ్యింది. రాజమండ్రికి చెందిన వీరభద్ర మెడికల్‌ డిస్ట్రబ్యూటర్‌ వద్ద పవన్‌కుమార్‌ గత అయిదు నెలలుగా క్యాష్‌ కలెక్షన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. మెడికల్‌ షాపుల వద్ద వసూళ్లు చేసిన నగదును తన అవసరాలకు వాడేసుకున్నాడు. ఈ క్రమంలో యజమానికి వసూళ్లుచేసిన డబ్బు కట్టకపోగా కొత్తనాటకానికి తెరతీశాడు. 
రాజమండ్రి ఇందిరానగర్‌లోని డంపింగ్‌యార్డ్‌ వద్దకు వచ్చేసరికి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆపి మెడమీద, పొట్టమీద బ్లేడ్‌వంటి వస్తువుతో దాడిచేసి తనవద్దనున్న బ్యాగును లాక్కెళ్లిపోయారని, అందులో వసూళ్లు చేసిన రూ.30 వేలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సదరు యజమానిని విచారించిన పోలీసులు సదరు పవన్‌కుమార్‌ సక్రమంగా డబ్బులు చెల్లించడంలేదని ఓనర్‌ ద్వారా తెలుసుకున్నారు. తనదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులుకు నిజాలు కక్కాడు పవన్‌కుమార్‌. బ్లేడ్‌ బ్యాచ్‌ అపహరించారన్న డబ్బులు ఇంటివద్దనే ఉన్నాయని చెప్పడంతో ఆ సొమ్మును స్వాదీనం చేసుకుని యజమాని ఫిర్యాదుతో పవన్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు.


మరో మూడు సంఘటనలు..
రాజా నగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముగ్గురు వ్యక్తులు ప్రయివేటు పంక్షన్‌ కేటరింగ్‌ నిమిత్తం రాజమండ్రి వచ్చారు. పంక్షన్‌ అనంతరం రాత్రి 12 గంటల సమయంలో కేటరింగ్‌ ఓనర్‌కు ఫోన్‌ చేసి తాము తిరిగి వస్తుంటే బ్లేడ్‌ బ్యాచ్‌ దారి అడ్డగించి కత్తిచూపి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని యజమానికి ఫోన్‌చేసి స్విచాప్‌ చేశారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా తెల్లవారు జామున గామన్‌ బ్రిడ్జీ వద్ద మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి వారు తమ యజమానితో చెప్పిందంతా అబద్దమని వారిపై కేసు నమోదు చేశారు. 


ఇదిలా ఉండగా రాజమండ్రి మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెంకట్‌నగర్‌కు చెందిన మానుకొండ నాగరాజు అనే యువకుడు తనకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి నీలవర్స్‌ పేర్లు చెప్పాలని వేధిస్తున్నాడని, అతని నుంచి తప్పించుకునేందుకు తనకుతానుగా బీరు బాటిల్‌తో గాయాలు చేసుకున్నాడని, ఇది సోషల్‌మీడియాలో బ్లేడ్‌బ్యాచ్‌ దాడి అంటూ ప్రచారం చేశారని, అదేవిధంగా  రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకరిపై ఒకరు తాగిన మద్యం మత్తులో దాడులు చేసుకుని ఇది కూడా బ్లేడ్‌బ్యాచ్‌గా ప్రచారం చేశారని పోలీసులు వెల్లడిరచారు. కొన్ని రోజుల క్రితం రాజమండ్రి హైటెక్‌ బస్టాండ్‌ వద్ద తెల్లవారు జామున కొంతమంది యువకుడు బైక్‌పై వచ్చి ప్రయాణికుని వద్దనుంచి సెల్‌ఫోన్‌, రూ.2,800 నగదును లాక్కుని వెళ్లిపోయారని ఈ ఘనటలో కూడా బ్లేడ్‌బ్యాచ్‌కు సంబంధం లేదని విచారణలో తేలిందని తూర్పు గోదావరి జిల్లా అదనపు ఎస్పీ వెల్లడించారు.