IND vs AUS Test:  తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ టెస్ట్ అరంగేట్రం ఖాయమైనట్లే కనిపిస్తోంది. రిషభ్ పంత్ గైర్హాజరీలో ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కు భరత్ కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అతనివైపు చూస్తున్నట్లు సమాచారం. 


గత ఒకటిన్నర సంవత్సరాలుగా తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ టెస్టు జట్టులో ఉంటున్నాడు. అయితే అతనికి తుది జట్టులో మాత్రం స్థానం దక్కడంలేదు. ఇప్పుడు ప్రమాదం కారణంగా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ బోర్డర్- గావస్కర్ సిరీస్ కు దూరమయ్యాడు. అతని స్థానంలో కేఎస్ భరత్ కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో ఇద్దరు కీపర్లు ఉన్నప్పటికీ మొదటి ప్రాధాన్యం భరత్ కే అన్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కీపింగ్ చేస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ లో పూర్తిస్థాయి కీపర్ గా బాధ్యతలు నిర్వహించలేదు. ఇక మరో స్పెషలిస్ట్ కీపర్ ఇషాన్ కిషన్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాడు. అప్పుడే అతనికి టెస్ట్ కీపింగ్ బాధ్యతలు వచ్చేలా లేవు. ఈ క్రమంలో కేఎస్ భరత్ వైపే జట్టు యాజమాన్యం, కోచ్, కెప్టెన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేఎస్ భరత్ కు దేశవాళీ క్రికెట్ లో మంచి రికార్డు ఉంది. అలాగే ఐపీఎల్ లోనూ మంచి గణాంకాలు నమోదు చేశాడు. 


భరత్ కే ఛాన్స్! 


'గతేడాది కాలంగా కేఎల్ రాహుల్ గాయాల బారిన పడ్డాడు. టెస్టుల్లో కీపింగ్ చేయడం అతనికి సరైనది కాదు. సుదీర్ఘ ఫార్మాట్ కు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు అవసరం. భారత జట్టులో ప్రస్తుతం కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ రూపంలో ఇద్దరు కీపర్లు ఉన్నారు. భరత్ వైపు మొగ్గు ఎక్కువగా ఉంది. అయితే ఎవరిని ఎంచుకోవాలో టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంటుంది.' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. 


10 మంది స్పిన్నర్లతో ప్రాక్టీస్


బోర్డర్ గావస్కర్ టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నాగ్‌పూర్‌ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత శిబిరం సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతోంది. దీంతో పాటు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శిబిరంలో మొత్తం 10 మంది స్పిన్నర్లు ఉన్నారు. వారు ఆటగాళ్లకు స్పిన్ ఆడటంలో ప్రాక్టీస్ ఇస్తున్నారు. ఆస్ట్రేలియాపై రోహిత్ టీమ్ ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగనుంది.


బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే భారత్ జట్టును ప్రకటించింది. ఇందులో స్పిన్ బౌలర్‌గా కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆల్‌రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు జట్టులో చోటు దక్కింది. ఈ విధంగా చూస్తే టీమ్ ఇండియాలో మొత్తం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ ప్రస్తుతం భారత శిబిరంలో 10 మంది స్పిన్నర్లు ఉన్నారు. వీరంతా బ్యాట్స్‌మెన్‌లను నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేలా చేయడంతో పాటు తమకు కూడా అండగా నిలుస్తున్నారు.