Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు 6 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టెస్టులో ఆడనున్నాడు. 


మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న కారణంగా జడేజా సెప్టెంబర్ 2022 నుంచి భారత్ తరఫున క్రికెట్ ఆడలేదు. టీ20 ప్రపంచకప్ నకు దూరమయ్యాడు.  సర్జరీ అనంతరం పునరావాసం కోసం ఎన్ సీఏకు వెళ్లిన జడ్డూ ఫిట్ నెస్ నిరూపించుకుని ఇటీవలే రంజీ మ్యాచ్ ల్లో ఆడాడు. సౌరాష్ట్ర తరఫున ఆడిన జడేజా మంచి ప్రదర్శన చేశాడు. దీంతో ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు ఈ ఆల్ రౌండర్ ఫాంలోకి వచ్చేశాడు. ఈ సందర్బంగా తాను కోలుకుని, ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 


భారత్ కు ఆడాలని ఆతృతగా ఉంది


నేను మళ్లీ భారత్ కు ఆడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను. కొంతకాలం క్రితం మోకాలి గాయంతో ఇబ్బందిపడ్డాను. సర్జరీ అవసరం అయ్యింది. అయితే టీ20 ప్రపంచకప్ నకు ముందు శస్త్రచికిత్స చేయించుకోవాలా లేదా తర్వాతా అనేది డైలమాలో పడ్డాను. అయితే వైద్యుల సూచన మేరకు వరల్డ్ కప్ కు ముందే సర్జరీ చేయించుకున్నాను. అని జడేజా అన్నాడు. 






వారు చాలా సహాయం చేశారు


5 నెలల తర్వాత టీమిండియా జెర్సీని ధరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మళ్లీ అవకాశం దక్కినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా రికవరీ ప్రయాణం చాలా కొంచెం కష్టంగా సాగింది. అయితే కొంతకాలంపాటు క్రికెట్ కు దూరంగా ఉంటే అలానే ఉంటుందని నాకు తెలుసు. ఎన్ సీఏలోని ఫిజియోలు, శిక్షకులు నాపై చాలా శ్రద్ధ చూపారు. నేను కోలుకోవడానికి చాలా సమయం ఇచ్చారు. సెలవు రోజుల్లో కూడా నాకోసం ప్రత్యేకంగా వచ్చేవారు. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. ఇప్పటినుంచి అంతా బాగుంటుందని ఆశిస్తున్నాను. అని జడేజా అన్నాడు. 


ఫిట్ నెస్ నిరూపించుకున్న జడ్డూ


గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ సందర్భంగా జడేజా గాయపడ్డాడు. మోకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ నకు దూరమయ్యాడు. తన కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జడ్డూ ఎన్ సీసీలో పునరావాసం పొందాడు. తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాడు. దీంతో సెలక్టర్లు జడేజాను బోర్డర్- గావస్కర్ ట్రోఫీకోసం సెలక్ట్ చేశారు. మొదటి రెండు టెస్టుల కోసం ఎంపికచేసిన 17 మంది స్క్వాడ్ లో జడ్డూకు స్థానం లభించింది.