IND vs AUS Test:


అహ్మదాబాద్‌ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి! ఆ జట్టులోని కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదు. గాయపడ్డ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ మిగతా సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవ్వడంతో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఇక కంకషన్‌, హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌తో బాధపడుతున్న డేవిడ్‌ వార్నర్‌ మిగతా మ్యాచులు ఆడటం సందేహంగా మారింది.


బోర్డర్‌-గావస్కర్‌ సిరీసులో టీమ్‌ఇండియా దుమ్మురేపుతోంది. నాలుగు టెస్టుల సిరీసులో 2-0తో ముందడుగు వేసింది. తొలి రెండు మ్యాచుల్ని కేవలం మూడు రోజుల్లోనే ముగించింది. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ మాయాజాలం, సిరాజ్‌, షమి పేస్‌ దెబ్బకు కంగారూలు కంగారు పడిపోతున్నారు. ఉస్మాన్ ఖవాజా, పీటర్‌ హాండ్స్‌కాంబ్‌ మినహా మిగతా బ్యాటర్లెవ్వరూ సాధికారికంగా ఆడటం లేదు. గింగిరాలు తిరిగే బంతుల్ని చూస్తేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కీలక ఆటగాళ్లు దూరమవుతుండటం గమనార్హం.


ఆస్ట్రేలియా కీలక బౌలర్లలో జోష్‌ హేజిల్‌వుడ్‌ ఒకరు. భారత పిచ్‌లపై అతడికి మంచి అవగాహన ఉంది. గతంలో టెస్టు, వన్డే, టీ20 సిరీసులు ఆడిన అనుభవం ఉంది. పైగా ఐపీఎల్‌లో రాణించాడు. సరైన లెంగ్తుల్లో బంతులు వేయడం, కీలక సమయాల్లో వికెట్లు అందించడం అతడి స్పెషాలిటీ. అలాంటిది సిరీస్‌కు వచ్చే ముందే అతడు గాయపడ్డాడు. దాంతో నాగ్‌పుర్‌, దిల్లీ టెస్టుల్లో ఆడించలేదు. రిజర్వు బెంచీకి పరిమితం చేశారు. ఇప్పటికీ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో అతడిని స్వదేశానికి పంపించేశారని సమాచారం. ఆసీస్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.


'జోష్‌ హేజిల్‌వుడ్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు స్వదేశానికి వెళ్తున్నాడు' అని ఆసీస్‌ కోచ్‌ మెక్‌డొనాల్డ్స్‌ అన్నాడు. దిల్లీ టెస్టులో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయపడ్డాడు. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన ఓ బంతి అతడి హెల్మెట్‌కు తగిలింది. అంతేకాకుండా అతడి చేతికి బంతి తగలడంతో వెంట్రుక పరిమాణంలో ఎముకలో చీలిక వచ్చినట్టు తెలిసింది. బహుశా అతడు మిగిలిన రెండు టెస్టులు ఆడటం కష్టమేనని సమాచారం. 'వార్నర్‌ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడు. జట్టు సమావేశంలో దీనిపై మాట్లాడుకున్నాం. మేం ఏ మాత్రం తొందరపడి ఆడించం. గాయం నుంచి కోలుకొనే సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి ఏమీ తెలియడం లేదు. ఈ విషయాన్ని వైద్య బృందానికి వదిలేస్తున్నాం. ఓ నిర్ణయానికి వచ్చాక వారు మాకు సమాచారం అందిస్తారు' అని మెక్‌డొనాల్డ్స్‌ తెలిపాడు.


డేవిడ్‌ వార్నస్‌ స్థానంలో ట్రావిస్‌ హెడ్‌ ఆడతాడని మెక్‌ డొనాల్డ్స్‌ చెప్పాడు. ఉపఖండం పిచ్‌లపై అతడు బాగా ఆడతాడని పేర్కొన్నాడు. స్పిన్‌, పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాడని వివరించాడు. ఇక ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ హడావిడిగా ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. అతడి కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అతడు ఎప్పుడు తిరిగొస్తాడన్న విషయంపై స్పష్టత లేదు.


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో రోహిత్ శర్మ (20 బంతుల్లో 31), విరాట్ కోహ్లీ (31 బంతుల్లో 20), ఛతేశ్వర్ పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్), శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. అంతకుముందు రవీంద్ర జడేజా (7 వికెట్లు), అశ్విన్ (3) లు చెలరేగటంతో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 113 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది.