Venkatesh Prasad on KL Rahul:


కేఎల్‌ రాహుల్‌ (Kl Rahul) పేరొస్తే చాలు! టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ (Venkatesh Prasad) అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. అతడిని కఠినంగా విమర్శిస్తున్నాడు. వరుసగా విఫలమవుతున్నా అతడిని ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. విదేశాల్లో గణాంకాలు చూసుకున్నా అంత మెరుగ్గా ఏమీ లేవంటున్నాడు. అతడితో పోలిస్తే శిఖర్ ధావన్‌, అజింక్య రహానె, శుభ్‌మన్ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌ గణాంకాలు మరింత బాగున్నాయని పేర్కొన్నాడు.




కొన్ని రోజులుగా కేఎల్‌ రాహుల్‌ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఆశించిన స్థాయిలో పరుగులేమీ చేయడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. అయినా టీమ్‌ఇండియా యాజమాన్యం అతడికి చోటిస్తోంది. అండగా నిలుస్తోంది. కానీ కొందరు రాహుల్‌ను అదే పనిగా విమర్శిస్తున్నారు. ఆడకపోయినప్పటికీ ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అతడిని జట్టులోంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్‌ ప్రసాద్‌ అతడిని తీవ్రంగా విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు.


కేఎల్‌ రాహుల్‌కు విదేశాల్లో అత్యుత్తమ రికార్డు ఉందన్న దృక్పథాన్ని వెంకటేశ్ ప్రసాద్‌ తిప్పికొట్టాడు. గణాంకాలను విశ్లేషించాడు. 'కేఎల్‌ రాహుల్‌కు విదేశీ గడ్డపై అత్యుత్తమ టెస్టు రికార్డు ఉందని చాలామంది భావన. కానీ గణాంకాలు వేరే విషయం చెబుతున్నాయి. అతడు విదేశాల్లో 56 ఇన్నింగ్సులు ఆడాడు. సగటు 30. మొత్తం 6 సెంచరీలు కొట్టాడు. ఆపై మిగిలినవన్నీ తక్కువ స్కోర్లే. అందుకే తక్కువ సగటు నమోదైంది. మిగతా వాళ్లవీ గమనించండి' అని వెంకీ ట్వీట్‌ చేశాడు.




'ఈ మధ్య కాలంలోని ఓపెనర్లలో శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) కు విదేశాల్లో మెరుగైన సగటు ఉంది. అతడు 40 సగటుతో 5 సెంచరీలు కొట్టాడు. విదేశాల్లో నిలకడగా ఆడకపోయినప్పటికీ శ్రీలంక, న్యూజిలాండ్‌పై చక్కని సెంచరీలు బాదేశాడు. పైగా స్వదేశంలో మంచి రికార్డుంది. ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడినప్పటికీ మిగతా దేశాల్లో మయాంక్‌ ఇబ్బంది పడ్డాడు. అయితే సొంతగడ్డపై అతడికి తిరుగులేదు. 13 ఇన్నింగ్సుల్లో 70 సగటుతో 2 డబుల్‌ సెంచరీలు, ఒక 150 స్కోరు చేశాడు. అందరూ తడబడ్డ వాంఖడేపై అతడు రాణించాడు. స్పిన్‌ బౌలర్లపై దాడి చేయగలడు. దేశవాళీ క్రికెట్లో మంచి అనుభవం ఉంది' అని వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నాడు.




'శుభ్‌మన్‌ గిల్‌ ఆడింది తక్కువే. విదేశాల్లో 14 ఇన్నింగ్సుల్లో 37 సగటు నమోదు చేశాడు. గబ్బాలో నాలుగో ఇన్నింగ్సులో అతడు చేసిన 91 స్కోరు అత్యుత్తమం. ఒకవేళ మీరు విదేశీ ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటే ఫామ్‌లో లేనప్పటికీ రహానె బెస్ట్‌. అతడు 50 టెస్టుల్లో 40 సగటుతో రాణించాడు. ఫామ్‌ లేకపోవడంతో జట్టులో చోటు దొరకడం లేదు' అని వెంకటేశ్ ప్రసాద్‌ వరుస ట్వీట్లు చేశాడు.