Bumrah Fitness clearance: 


టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) ఇప్పట్లో టీమ్‌ఇండియాలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అతడు నేరుగా ఐపీఎల్‌ సరికొత్త సీజన్‌ ఆడతాడని సమాచారం. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) అతడి ఫిట్‌నెస్‌పై కఠోరంగా శ్రమిస్తూనే ఉంది. ఒకవేళ ఐపీఎల్‌ ఆడినా అతడి పనిభారాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించనుంది.


ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులు, మూడు వన్డేలకు సెలక్టర్లు జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో జస్ప్రీత్‌ బుమ్రాకు చోటు దక్కలేదు. అతడు ఇప్పటికీ పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించకపోవడమే ఇందుకు కారణం. వెన్నెముక గాయం, అత్యంత సున్నితమైన సమస్య కావడంతో అతడి ఎంపికపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు అతడిని తాజాగా ఉంచాలని భావిస్తున్నారు. అయితే ఈ మధ్యలో వచ్చే ఐపీఎల్‌లో అతడి పనిభారాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.


ఐపీఎల్‌లో అత్యంత బలమైన జట్టు ముంబయి ఇండియన్స్‌. వారికి జస్రీత్‌ బుమ్రా ఎంతో కీలకం. అందుకే రూ.12 కోట్లు చెల్లించి రీటెయిన్‌ చేసుకుంది. ఇప్పటికే ఆరు నెలలుగా అతడు క్రికెట్‌ ఆడటం లేదు. టీ20 ప్రపంచకప్‌ నుంచి మైదానానికి దూరంగానే ఉన్నాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడని అంతా భావించారు. అందుకు తగ్గట్టే ముందు జరిగిన శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ఇబ్బంది ఎదురవ్వడంతో అతడిని తప్పించారు. ప్రస్తుతం అతడు ఎన్‌సీఏలోనే రీహబిలిటేషన్‌లో ఉన్నాడు.


ఎన్‌సీఏ మైదానంలో పది రోజుల్లో బుమ్రా రెండు, మూడు మ్యాచులు ఆడాడని తెలిసింది. ఇందులో అతడు మెరుగ్గానే కనిపించాడని అంటున్నారు. అయినప్పటికీ ఎన్‌సీఏ మేనేజర్లు అతడికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ అవ్వలేదు. దాంతో అతడు నేరుగా ఐపీఎల్‌ ఆడతాడని సమాచారం. సెప్టెంబర్లో ప్రపంచకప్‌ ఉండటంతో అతడిపై పనిభారం మెల్లగా పెంచాలని టీమ్‌ఇండియా యాజమాన్యం భావిస్తోంది. ఐపీఎల్‌ ఆడినా పనిభారం పర్యవేక్షించాలని అనుకుంటోంది. ఇప్పటికైతే దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించలేదు.  మున్ముందు తీసుకోవచ్చు.


తమ ఆటగాళ్ల పనిభారాన్ని పర్యవేక్షించేందుకు విదేశీ బోర్డులు గతంలో ఇలాంటి చర్యలు తీసుకున్నాయి. షరతులతో కూడిన నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లు ఇచ్చేవి. బౌలర్లతో నెట్స్‌లో 24 కన్నా ఎక్కువ బంతులు వేయించొద్దని సూచించాయి. పరిమిత సంఖ్యను మించి మ్యాచులు ఆడకుండా చూసేవి. బౌలర్ల విషయంలో బీసీసీఐ సైతం గతంలో ఇలా చేసింది. బహుశా బుమ్రా విషయంలో మరికాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాయని సమాచారం.


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో రోహిత్ శర్మ (20 బంతుల్లో 31), విరాట్ కోహ్లీ (31 బంతుల్లో 20), ఛతేశ్వర్ పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్), శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. అంతకుముందు రవీంద్ర జడేజా (7 వికెట్లు), అశ్విన్ (3) లు చెలరేగటంతో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 113 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది.