భారత్‌ ప్రపంచకప్‌ సంగ్రామం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కఠిన ప్రత్యర్థి. ఆయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై చెపాక్‌ వేదికగా జరిగే ఈ తొలి పోరులో విజయం సాధించి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా విజయంపై కన్నేసింది. అయితే వరల్డ్‌కప్‌లాంటి మెగా ఈవెంట్‌లో ఆస్ట్రేలియాతో అంత తేలిగ్గా ఉండదు. భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే గట్టిపోటీ ఎదురవుతుంది. వన్డే ఫార్మాట్‌లో భారత్, ఆస్ట్రేలియాల రికార్డులను పరిశీలిస్తే కంగారులదే పైచేయిగా ఉంది. ఆస్ట్రేలియాలో కొందరు ఆటగాళ్లతో భారత్‌కు ప్రమాదం పొంచి ఉంది. వారిని పక్కా ప్రణాళికతో అడ్డుకోకపోతే టీమిండియాకు తలనొప్పులు తప్పక పోవచ్చు. ఆ అయిదుగురు ఆటగాళ్లు ఎవరంటే

 

మిచెల్‌ స్టార్క్‌

ఆస్ట్రేలియా జట్టులో అతి ప్రమాదకర బౌలర్‌ మిచెల్ స్టార్క్. కచ్చితమైన యార్కర్లు వేసే మిచెల్‌ స్టార్క్‌ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో అన్న దానిపై ఫలితం ఆధారపడి ఉంది. స్టార్క్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా టీమిండియా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. ప్రారంభంలో కొత్త బంతితో మిచెల్ స్టార్క్.. భారత్‌కు  పెద్ద ముప్పుగా మారవచ్చు.

 

గ్లెన్ మాక్స్‌వెల్ 

రాజ్‌కోట్‌లో జరిగిన వన్డేలో మ్యాక్స్‌వెల్‌ బాల్‌తోనూ రాణించి సత్తా చాటాడు. విధ్వంసకర ఆటగాడిగా పేరొన్న మ్యాక్స్‌వెల్‌ ఈమధ్య బాల్‌తోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. స్పిన్‌కు స్వర్గధామంగా ఉండే చెపాక్‌ పిచ్‌పై టీమిండియా బ్యాటర్లకు మ్యాక్స్‌వెల్‌ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. భారత బ్యాటర్లు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటారు. అయినా మ్యాక్స్‌వెల్‌పై ఓ కన్నేసి ఉంచాల్సిందే. బ్యాట్‌తోనూ మాక్స్‌వెల్ మెరుపులు మెరిపించగలడు. 

 

డేవిడ్ వార్నర్ 

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దాదాపు ప్రతి మ్యాచ్‌లో మంచి ప్రదర్శనలతో సత్తా చాటుతున్నాడు. కానీ వార్నర్‌ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. అయినా వార్నర్‌  క్రీజులో నిలదొక్కుకుంటే.. భారత్‌కు పెద్ద ముప్పుగా మారుతాడు. భారత ఆటగాళ్లు, ఇక్కడి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న వార్నర్‌ను వీలైనంత త్వరగా భారత బౌలర్లు పెవిలియన్‌ చేర్చాల్సి ఉంది. 

 

మిచెల్‌ మార్ష్‌

ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ కూడా ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తోనే కాకుండా పేస్‌ బౌలింగ్‌తోనూ మార్ష్‌ జట్టుకు ఉపయోగపడతాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అతడు ఓపెనర్‌గా కూడా బరిలోకి దిగాడు. మార్ష్, డేవిడ్ వార్నర్‌తో కలిసి బరిలోకి దిగి ఎదురుదాడికి దిగితే టీమిండియా ప్రతికూల ఫలితం తప్పదు. కాబట్టి వీరిని త్వరగా అవుట్‌ చేస్తే భారత పని సులువవుతుంది. చెన్నై స్లో పిచ్‌పై మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో వైవిధ్యాన్ని కూడా చూపగలడు. 

 

హాజిల్‌వుడ్ 

హాజిల్‌వుడ్‌ కూడా అద్భుతమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లకు సవాల్‌ విసరగలడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌ ఐపీఎల్‌లో ధోని సారధ్యంలో మరింత రాటుదేలాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన హాజిల్‌వుడ్‌కు... చెన్నైలోని చెపాక్‌ పిచ్‌ ఎలా ప్రవర్తిస్తుందో బాగా తెలుసు. హాజిల్‌వుడ్‌ స్వింగ్‌కు భారత బ్యాటర్లు సమాధానం చెప్పాల్సి ఉంది.