South Africa beat Sri Lanka by 102 runs:


బౌండరీలల వరద.. సిక్సర్ల జడివానలా సాగిన పోరులో దక్షిణాఫ్రికాదే పైచేయి అయింది. ఇరు జట్లు కలిపి 754 పరుగులు చేసిన పోరులో సఫారీ జట్టు విజయం సాధించి.. వన్డే వరల్డ్‌కప్‌లో ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపింది. శనివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో పోరులో టెంబా బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు 102 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించి మెగాటోర్నీలో శుభారంభం చేసింది. ఐసీసీ టోర్నీల్లో దురదృష్టాన్ని నెత్తిన పెట్టుకొని తిరిగే జట్టుగా ముద్ర పడ్డ దక్షిణాఫ్రికా.. ఈ సారి తాము కప్పు కొట్టేందుకే భారత్‌లో అడుగు పెట్టామని తొలి రోజు తమ ఆటతీరుతో ప్రపంచానికి చాటారు. అసలు అలుపన్నదే లేకుండా.. బంతి మీద ఏదో ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు.. లంకేయులపై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. 


టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. 1975 నుంచి ప్రారంభమైన మెగాటోర్నీ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్‌ డెర్‌ డసెన్‌ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), అయిడెన్‌ మార్క్‌రమ్‌ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో లంకేయులను చీల్చిచెండాడారు. ఆఖర్లో క్లాసెన్‌ (32; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (39 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా విజృంభించడంతో సఫారీ జట్టు రికార్డు స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో మధుషనక రెండు వికెట్లు పడగొట్టాడు.


అనంతరం లక్ష్యఛేదనలో లంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో స్కోర్, వికెట్ల పతనం చూస్తే.. 200 పరుగులు మాత్రమే చేస్తుందనేలా కనిపించింన లంక.. చరిత అసలంక (64 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), కుషాల్‌ మెండిస్‌ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), కెప్టెన్‌ డసున్‌ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడటంతో చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది. సఫారీ బౌలర్లలో జాన్‌సెన్‌, గెరాల్డ్‌, కేశవ్‌ మహారాజ్‌, కగిసో రబాడ తలా 2 వికెట్లు పడగొట్టారు. 


ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు మొదట 45 ఫోర్లు, 14 సిక్సర్లు బాదారు. 45 ఫోర్లతో 180 పరుగులు పిండుకున్న సఫారీలు.. 14 సిక్సర్లతో మరో 84 రన్స్‌ జట్టు ఖాతాలో వేశారు. ఫలితంగా కేవలం బౌండ్రీల ద్వారానే ప్రొటీస్‌ 264 పరుగులు సాధించింది. అనంతరం కొండంత లక్ష్యం కండ్ల ముందు కనిపిస్తున్నా.. శ్రీలంక ఏమాత్రం వెరవలేదు. ఓపెనర్లు పాతుమ్‌ నిషాంక (0), కుషాల్‌ పెరెరా (7) పూర్తిగా విఫలమైనా.. కుషాల్‌ మెండిస్‌ ధాటిగా ఆడాడు. సఫారీల ఆటకు కౌంటర్‌ అటాక్‌ ఇవ్వాలనే లక్ష్యంతో.. సిక్సర్లే లక్ష్యంగా శివతాండవమాడాడు. ఈ క్రమంలో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 25 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. భారీ షాట్లతో మైదానాన్ని సమ్మోహన పరిచిన మెండిస్‌ క్యాచ్‌ ఔట్‌ కాగా.. సమరవిక్రమ (23), ధంనజయ డిసిల్వ (11) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడిన చరిత అసలంక.. లంకేయులను పోటీలో ఉంచాడు. చివర్లో షనకు కూడా ప్రయత్నించినా.. జట్టును గెలుపు గీత దాటించలేకపోయారు. దూకుడే మంత్రంగా సాగిన లంక ఇన్నింగ్స్‌లో 29 ఫోర్లు, 17 సిక్సర్లు నమోదు కావడం కొసమెరుపు.