Asian Games 2023 India Medal Tally:
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా చాటింది. విదేశీ అథ్లెట్లు, ఆటగాళ్లతో పోటీపడి పతకాలు సాధించారు. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో తొలిసారి భారత్ పతకాల సంఖ్య 100 దాటి పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. చైనాలోని హంగ్జౌలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో భారత్ ఏకంగా 107 పతకాలు పతకాలు సాధించగా.. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలున్నాయి.
ఆసియా క్రీడల్లో భారత్ ప్రస్థానం ఇలా..
1951లో జరిగిన తొలి ఆసియా క్రీడల్లో భారత్ 15 స్వర్ణాలు, 16 రజతాలు, 20 కాంస్యాల మొత్తం 51 పతకాలతో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. కానీ క్రమంగా భారత్ పరిస్థితి దారుణంగా తయారైంది. రెండో ఆసియా క్రీడల్లో కేవలం 5 స్వర్ణాలు సహా మొత్తం 17 పతకాలతో 5వ స్థానానికి పరిమితమైంది. ఆ తరువాత 1962లో 4వ ఆసియా క్రీడల్లో అత్యుత్తమంగా 10 స్వర్ణాలు, 13 రజతాలు, 10 కాంస్యాలతో మొత్తం 33 పతకాలతో 3వ స్థానానికి ఎగబాకింది.
1990లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ కేవలం ఒక్క స్వర్ణం సాధించి ఓవరాల్ గా 23 పతకాలతో 11వ స్థానంతో సరిపెట్టుకుంది. 2006, 2010, 2014, 2018, 2023 ఆసియా క్రీడలలో యాభైకి పైగా పతకాలను భారత ఆటగాళ్లు గెలిచారు. గత ఆసియా క్రీడల్లో 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలతో మొత్తం 70 పతకాల మార్క్ తొలిసారిగా చేరుకున్న భారత్.. ఈ ఎడిషన్ లో మరింతగా దూసుకెళ్లి సెంచరీ చేసింది. తాజాగా చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు సహా మొత్తం 107 పతకాలతో దుమ్మురేపారు భారత ఆటగాళ్లు.
ఆసియా క్రీడల్లో మొదటి ఎడిషన్ నుంచి ఇప్పటివరకూ భారత్ మొత్తంగా 753 పతకాలను సాధించింది. ఇందులో 173 స్వర్ణాలు, 238 రజతాలు, 348 కాంస్యాలున్నాయి. అథ్లెటిక్స్ విభాగంలో భారత్ కు అధికంగా 254 పతకాలు రాగా, అందులో 79 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. రెజ్లింగ్, షూటింగ్ లలో వరుసగా 59, 58 పతకాలు భారత్ ఖాతాలోకి చేరాయి. తాజా ఎడిషన్ లోనూ అథ్లెటిక్స్ లో భారత్ 30కి పైగా మెడల్స్ కైవసం చేసుకుని సత్తా చాటింది.
ఏడాది | స్వర్ణం | రజతం | కాంస్యం | మొత్తం | స్థానం |
1951 | 15 | 16 | 20 | 51 | 2 |
1954 | 5 | 4 | 8 | 17 | 5 |
1958 | 5 | 4 | 4 | 13 | 7 |
1962 | 10 | 13 | 10 | 33 | 3 |
1966 | 7 | 3 | 11 | 21 | 5 |
1970 | 6 | 9 | 10 | 25 | 5 |
1974 | 4 | 12 | 12 | 28 | 7 |
1978 | 11 | 11 | 6 | 28 | 6 |
1982 | 13 | 19 | 25 | 57 | 5 |
1986 | 5 | 9 | 23 | 37 | 5 |
1990 | 1 | 8 | 14 | 23 | 11 |
1994 | 4 | 3 | 16 | 23 | 8 |
1998 | 7 | 11 | 17 | 35 | 9 |
2002 | 11 | 12 | 13 | 36 | 7 |
2006 | 10 | 17 | 26 | 53 | 8 |
2010 | 14 | 17 | 34 | 65 | 6 |
2014 | 11 | 10 | 36 | 57 | 8 |
2018 | 16 | 23 | 31 | 70 | 8 |
2023 | 28 | 38 | 41 | 107 | 4 |