ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మండపల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని దాదాపు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు గ్రామంలోని కొందరికి కడుపునొప్పి రాగా... మరికొందరు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఇందులో ఓ నెల రోజుల బాలింతతో పాటూ పది మంది చిన్నారులు ఉన్నారు.
నిన్న సాయంత్రం పూట మెండపల్లి గ్రామంలో పెత్రామాస (పితృ మాసం) కార్యక్రమం సందర్భంగా ఓ ఇంట్లో స్థానికులకు భోజనం ఏర్పాటు చేశారు. భోజనాలు తిన్న కొందరు అర్ధరాత్రి నుంచి కడుపు నొప్పితో, వాంతులు, విరోచనాలు చేసుకోగా.. ఉదయం తెల్లవారు జామున కొందరు ఇదే పరిస్థితి తలెత్తి ఇబ్బంది పడ్డారు. గ్రామస్తులు 108కు సమాచారం ఇచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. కొందరిని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో... మరికొందరిని అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి, మరికొందరూ నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స అందిస్తునారు. ఉట్నూర్ ఏజెన్సీ డిప్యూటీ డీఏంహెచ్ఓ డా. బుక్య విజయ్ కుమార్ అస్వస్థతకు గురైన వారిని పరీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉట్నూర్ డిప్యూటీ డిఏంహెచ్ఓ డా బుక్య విజయ్ కుమార్ మాట్లాడుతూ.... మండపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం గ్రామస్తులు ఓ విందు కార్యక్రమంలో పాల్గొని భోజనం చేయగా రాత్రి నుండి కొందరికి కడుపునొప్పి రావడంతో పాటు మరికొంతమంది వాంతులు విరోచనాలు చేసుకున్నారు. ఉదయం తెల్లవారుజామున సైతం మరికొందరు కడుపునొప్పితోపాటు వాంతులు విరోచనాలు చేసుకోవడంతో గ్రామస్తులు 108కు సమాచారం అందించగ.. అస్వస్థతకు గురైన వారందరిని ఆసుపత్రికి తరలించారు. పది మందిని రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంత మందిని తరలించగా.. పడకగదులు లేక మరికొందరిని ఉట్నూర్ ఆసుపత్రికి, మరికొందరు స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోయారని చెప్పారు.
ప్రస్తుతానికి అస్వస్తతకు గురైన వారి పరిస్థితి కొంత నిలకడగా ఉందని గ్రామంలో తమ వైద్య బృందం ఇంటింటా తిరిగి పరీక్షలు నిర్వహిస్తూ మూడు రోజులపాటు క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు అదేవిధంగా శానిటేషన్ పరంగా ఆర్డబ్ల్యూఎస్ , పంచాయతీ అధికారులకు సైతం సమాచారం అందించి అక్కడ నీటి శాంపిల్స్ తో పాటు ఫుడ్ పాయిజన్ కు సంబంధించిన ఆహార పదార్థాల శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామంలో ఎవరికీ ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా మూడు రోజులపాటు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఏజెన్సీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయకుమార్ తెలిపారు.
స్థానిక అధికారులు అప్రమత్తం
ఇంద్రవెల్లి మండలం మెండపల్లి గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఆహారం తిని అనారోగ్యానికి ఘటనపై స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వరకు ఉన్నారు? మిగిలిన వారి పరిస్థితి ఏమిటనే ఆరా తీస్తున్నారు. మిగిలిన వారిని కనుగొని వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం వీరందరికీ వైద్యం అందిస్తున్నట్లు స్థానిక నాయకులు వెల్లడించారు.