Congress Schemes :  వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంచలన పథకాలను ప్రకటించింది.  సోనియా గాంధీ ద్వారా ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. అయితే అవి పూర్తి స్థాయి మేనిఫెస్టో కాదు. దీనిపై ఇప్పటికీ కసరత్తు చేస్తున్నారు. ఈ మేనిఫెస్టోలో మరిన్ని సంచలన విషయాలు.. పథకాలు ఉండేలా చూసుకుంటున్నారు. అందులో భాగంగా  పేద కుటుంబాల్లో పెళ్లి జరిగితే ముఖ్యంగా అమ్మాయి పెళ్లికి తులం బంగారం ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది సంచలనాత్మక పథకం అవుతుందని భావిస్తున్నారు. 


ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ 


ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్‌.. మరో సంచలన హామీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు స్కీం కింద రైతులకు ఎకరాకు ఏటా పదివేలు అందిస్తుండగా.. తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కౌలు రైతులకు సైతం రైతు బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చింది.  ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న హస్తం పార్టీ.. అన్ని వర్గాలను ఆకర్షించేలా మేనిఫెస్టో రూపొందించాలని ప్లాన్ చేసింది. మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదలు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునే హామీలపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఉచిత మెట్రో ప్రయాణం, ఫ్రీ వైఫై లాంటి పథకాలపైనా ఆలోచనలు చేస్తోంది.


కల్యాణ మస్తు  పథకంలో భాగంగా బంగారం                     


బీఆర్ఎస్‌ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకానికి మరో పేరు పెట్టి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మీ స్థానంలో పసుపు – కుంకుమ అనే పథకం తీసుకురావాలని మేనిఫెస్టో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద పెళ్లి కూతురుకు రూ. లక్ష నగదుతో పాటు తులం బంగారం అందించాలని జీవన్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రస్తుతం  సాధ్యాసాధ్యాలను మేనిఫెస్టో కమిటీ పరిశీలన జరపుతోంది. పెళ్లి అంటే ఎక్కువ ఖర్చు బంగారం కోసమే ఉంటుంది కాబట్టి.. తులం ఇస్తే.. మహిళల్లో అనూహ్యమైన స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో ఉచితాల వరద ఖాయం                            


తెలంగాణలో ఈ సారి ఎన్నికల పోరులో మేనిఫెస్టోలు ఉచిత పథకాలతో హోరెత్తడం ఖాయంగా  కనిపిస్తోంది.  కాంగ్రెస్ పథకాలకు కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్  ప్రత్యేకమైన కసరత్తు జరుపుతున్నారు. అన్ని వర్గాలకు ఎంతో కొంత మేలు జరిగేలా చూస్తే ఓట్ల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందు కోసం మేధోమథనం జరుపుతున్నారు. ఈ నెలలోనే మేనిఫెస్టోలతో తెలంగాణ ఓటర్లపై ఉచిత పథకాల వరద కురవడం ఖాయంగా కనిపిస్తోంది.