IND vs AUS 3rd Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే అసలు పరీక్ష మూడో టెస్టులో ఎదురుకానుంది. ఎందుకంటే..
ఇండోర్ టెస్ట్ కోసం మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ బౌన్సీ పిచ్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. తొలి 2 టెస్టుల్లో స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. అక్కడ మొదటి రోజు నుంచే స్పిన్ తిరగడం ప్రారంభించింది. అయితే మూడో టెస్ట్ పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉంది. అలాగే ఆస్ట్రేలియా టీంలో మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ లు జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో వారి పేస్ బలం పెరిగింది. కాబట్టి వారి విజయావకాశాలు మెరుగయ్యాయి. ఇండోర్ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందన్న అంచనాతో భారత్ మూడో పేసర్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇండోర్ లో చివరిసారిగా భారత్, బంగ్లాదేశ్ తో టెస్ట్ ఆడింది. ఆ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. అప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను మన పేసర్లు హడలెత్తించారు. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు కూడా పిచ్ పేసర్లకు సహకరించేలా తయారు చేశారు. దాంతో పాటు బ్యాటర్లకు సహకారం ఉంటుంది. అయితే ఈ వేదిక మీద ఎక్కువ టెస్టులు జరగలేదు. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 353. మ్యాచ్ సాగుతున్న కొద్దీ ఈ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంలా ఉంటుంది.
రెట్టించిన ఉత్సాహంతో భారత్
ఆస్ట్రేలియాపై 2 టెస్టులు గెలిచిన భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 64.06 పాయింట్ల శాతంతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక మూడో స్థానంలో ఉంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా భారత్ తో మిగిలిన రెండు టెస్టుల్లో ఒకదానిని డ్రా చేసుకున్నా ఫైనల్ కు చేరుకుంటుంది.
కెప్టెన్ దూరం
ఇండోర్ టెస్టుకు ముందు ఆసీస్‌కు షాక్! ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. కుటుంబ కారణాలతో స్వదేశంలోనే ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అతడి గైర్హాజరీలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది.
భారత జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భారత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లేదా ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.