IND vs AUS 3rd Test: విరామం ముగిసింది. భారత జట్టు మళ్లీ ఆట మొదలుపెట్టింది. బోర్డర్- గావస్కర్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ ముగిసిన అనంతరం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లు ఆదివారం నుంచి శిక్షణ ప్రారంభించారు. రెండో టెస్ట్ 3 రోజుల్లోనే ముగిసినందున, మూడో టెస్టుకు ముందు భారత ఆటగాళ్లకు చాలా విరామం లభించింది. 6 రోజులపాటు క్రికెటర్లు విశ్రాంతి తీసుకున్నారు. మార్చి 1 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మళ్లీ నిన్నటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ఇండోర్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ జరగనుంది. హోల్కర్ స్టేడియంలో ఆదివారం నుంచి రోహిత్ శర్మ అండ్ కో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. మిగిలినవారు ఈరోజు నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు. ఇప్పటికే భారత్ ఈ సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమిండియా ట్రోఫీని నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అధికారికంగా బెర్తును దక్కించుకుంటుంది.
రెట్టించిన ఉత్సాహంతో భారత్
ఆస్ట్రేలియాపై 2 టెస్టులు గెలిచిన భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 64.06 పాయింట్ల శాతంతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక మూడో స్థానంలో ఉంది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా భారత్ తో మిగిలిన రెండు టెస్టుల్లో ఒకదానిని డ్రా చేసుకున్నా ఫైనల్ కు చేరుకుంటుంది.
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఇలా!
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ను 4-0 లేదా 3-1 తో గెలవాలి.
ఆస్ట్రేలియాతో మిగిలిన 2 టెస్టులను డ్రా చేసుకున్నాఫైనల్ అవకాశాలు ఉంటాయి. అయితే అది శ్రీలంక- న్యూజిలాండ్ సిరీస్ పై ఆధారపడి ఉంటుంది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మిగిలిన 2 టెస్టుల్లో ఓడితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలు దెబ్బతింటాయి.
ఆసీస్ తో సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్ లో గెలిస్తే అధికారికంగా ఫైనల్ బెర్తును దక్కించుకుంటుంది.
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లు ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి.
కెప్టెన్ దూరం
ఇండోర్ టెస్టుకు ముందు ఆసీస్‌కు షాక్! ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. కుటుంబ కారణాలతో స్వదేశంలోనే ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అతడి గైర్హాజరీలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది.
దిల్లీ టెస్టు ఓడిపోయిన వెంటనే ప్యాట్ కమిన్స్ సిడ్నీకి వెళ్లిపోయాడు. అనారోగ్యానికి గురైన అతడి తల్లిని చూసుకుంటున్నాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఇండోర్ టెస్టు ఆడేందుకు అతడు రిటర్న్ టికెట్ సైతం బుక్ చేసుకున్నాడు. ఆదివారం రావాలనుకున్నాడు. ఇంతలోనే తన నిర్ణయం మార్చుకున్నాడు. కొన్ని రోజులు కుటుంబంతోనే ఉండనున్నాడు. దాంతో వన్డే సిరీసుకు వస్తాడో లేదోనన్న సందిగ్ధం నెలకొంది.