IND vs AUS 3rd T20: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మధ్య ఉన్న సాన్నిహిత్యం పెరిగింది. మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియాలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 


రెండో టీ20 లో ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టిన కార్తీక్ భారత్ ను గెలిపించాడు. అప్పుడు నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న రోహిత్.. కార్తీక్ ను ఆనందంగా హత్తుకుంటూ సంబరాలు చేసుకున్నాడు. మూడో టీ20లో గ్లెన్ మాక్స్ వెల్ ను రనౌట్ చేసినప్పుడు కూడా రోహిత్ ఆనందంతో దినేశ్ కార్తీక్ ను హత్తుకుని.. అతని హెల్మెట్ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 


మూడో టీ20లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే అక్షర్ పటేల్ ఆసీస్ కెప్టెన్ ను పెవిలియన్ చేర్చాడు. దంచికొట్టిన గ్రీన్ 52 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్ ఎక్కువసేపు నిలవలేదు. అతన్ని దినేశ్ కార్తీక్ రనౌట్ చేశాడు. అప్పుడే రోహిత్ సంతోషంతో కార్తీక్ ను ముద్దు పెట్టుకున్నాడు. 


సిరీస్ విజయం


సిరీస్‌ డిసైడర్‌లో భారత్‌ అద్భుత విజయం అందుకుంది. మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే ఛేదించేసింది. టీమ్‌ఇండియా మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ (69; 36 బంతుల్లో 5x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఛేదన రారాజు విరాట్‌ కోహ్లీ (63; 48 బంతుల్లో 3x4, 4x6) సొగసైన షాట్లతో మురిపించాడు. అంతకు ముందు ఆసీస్‌లో కామెరాన్‌ గ్రీన్‌ (52; 21 బంతుల్లో 7x4, 3x6), టిమ్‌ డేవిడ్‌ (54; 27 బంతుల్లో 2x4, 4x6) హాఫ్‌ సెంచరీలు చేశారు.










మొన్నటి ఆసియా కప్‌ సమయంలో రోహిత్‌ శర్మ కాస్త నెగటివ్‌గా ట్రోల్‌ అయ్యాడు. మ్యాచ్‌ కీలకసమయంలో ఉన్నప్పుడు బౌలర్‌ ఏదో చెబుతుంటే పట్టించుకోకుండా వెళ్లిపోవడం... క్యాచ్ నేలపాలు చేసిన ఫీల్డర్‌పై అరవడం ఇలా ఆ టోర్నీ మొత్తంలో రోహిత్‌ రియాక్షన్‌తో నెటిజన్లు ఆట ఆడుకున్నారు. కానీ ఆస్ట్రేలియా మ్యాచ్‌ల సందర్భంగా మాత్రం గతానికి భిన్నమైన రోహిత్‌ కనిపిస్తున్నాడు.