IND vs AUS 3rd T20: హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్ 2-1తో గెలుచుకుంది టీమిండియా. దీంతోపాటు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు (21) గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సాధించింది. దీంతో పాక్ పేరిట ఉన్న 20 మ్యాచుల రికార్డును బద్దలు కొట్టింది. పాకిస్థాన్ జట్టు గతేడాది 20 టీ20 విజయాలను నమోదు చేసింది.
ఆసీస్ పై విజయం.. సిరీస్ కైవసం
సిరీస్ డిసైడర్ మ్యాచులో అద్భుతంగా ఆడిన భారత్.. ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కామెరూన్ గ్రీన్ (52), టిమ్ డేవిడ్ (54) అర్థశతకాలతో రాణించటంతో 186 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆరంభంలోనే రాహుల్, రోహిత్ ల వికెట్లు కోల్పోయింది. అయితే మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ (63) రాణించటంతో మరో బంతి మిగిలుండగానే విజయాన్నందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సూర్యకుమార్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అక్షర్ పటేల్ ఎంపికయ్యారు.st
ఉప్పల్ 'కింగ్' కోహ్లీ
తనకు అచ్చొచ్చిన మైదానంలో విరాట్ కోహ్లీ మరోసారి ఆకట్టుకున్నాడు. సొగసైన బ్యాటింగ్ తో అలరించాడు. మొదటి ఓవర్లోనే రాహుల్ ఔటవటంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఆచితూచి ఆడాడు. తనను ఇబ్బంది పెట్టాలని చూసిన స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్ లో ఎదురుదాడికి దిగాడు. ఓవైపు సూర్యకుమార్ దంచి కొడుతుంటే.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతనికి చక్కని సహకారం అందించాడు. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమైన సమయంలో మొదటి బంతినే సిక్సర్ గా మలిచి సమీకరణాన్ని తేలిక చేశాడు. ఆ తర్వాత బంతికి కోహ్లీ ఔటైనా.. భారత్ ఎలాంటి ఇబ్బంది లేకుండానే మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచుకు ముందు ఉప్పల్ మైదానంలో విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లలో 8 మ్యాచుల్లో కలిపి 607 పరుగులు చేశాడు. ఈ స్టేడియంలో అతని సగటు 75. 87గా ఉంది.