IND vs AUS 3rd T20: హైదరాబాద్‌లో పరుగులు వరద పారింది! సిక్సర్ల మోత మోగింది. ఉప్పల్‌లో రాత్రిపూట సూర్యోదయం చోటు చేసుకుంది! సిరీస్ డిసైడర్‌లో భారత్ అద్భుత విజయం అందుకుంది. మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగుల మరో బంతి మిగిలుండగానే ఛేదించేసింది. టీమ్‌ఇండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (69; 36 బంతుల్లో 5x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదన రారాజు విరాట్ కోహ్లీ (63; 48 బంతుల్లో 3x4, 4x6) సొగసైన షాట్లతో మురిపించాడు. అంతకు ముందు ఆసీస్‌లో కామెరాన్ గ్రీన్ (52; 21 బంతుల్లో 7x4, 3x6), టిమ్ డేవిడ్ (54; 27 బంతుల్లో 2x4, 4x6) హాఫ్ సెంచరీలు చేశారు.
సూర్య.. అన్‌బిలీవబుల్!
ఉప్పల్ స్టేడియం అంటేనే రన్ ఫెస్ట్‌కు మారుపేరు! అందుకు తగ్గట్టే టీమ్‌ఇండియా ఛేదన సాగింది. తొలి మూడు ఓవర్లలో ఎక్కువ పరుగులేం రాలేదు. జట్టు స్కోరు 5 వద్దే ఓపెనర్ కేఎల్ రాహుల్ (1)ను డేనియల్ సామ్స్ ఔట్ చేశాడు. షాట్లు ఆడబోయిన రోహిత్ శర్మ (17)ను ప్యాట్ కమిన్స్ పెవిలియన్‌కు పంపించాడు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీపై లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను ప్రయోగించి ఒత్తిడి తెచ్చేందుకు ఆసీస్ ప్రయత్నించింది. వీటిని ఏమాత్రం లెక్కచేయని కింగ్ తనదైన శైలిలో దూకుడు కొనసాగించాడు. వరుస బౌండరీలతో అతడిపై ఎదురుదాడికి దిగాడు.
మరోవైపు సూర్యకుమార్ రావడంతోనే సిక్సర్లు, బౌండరీలు బాదడం షురూ చేశాడు. ఊహించని షాట్లతో చెలరేగాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతడు ఆడుతున్నంత సేపు విరాట్ సెకండ్ ఫెడల్ ప్లే చేశాడు. సూర్యను చూస్తే 18 ఓవర్లకే టీమ్‌ఇండియా గెలిచేలా కనిపించింది. భీకరంగా ఆడుతున్న అతడిని జట్టు స్కోరు 134 వద్ద హేజిల్‌వుడ్ ఔట్ చేశాడు. రన్‌రేట్ మరీ ఎక్కువ లేకపోవడంతో టీమ్‌ఇండియాపై ఒత్తిడి కనిపించలేదు. 17, 18 ఓవర్లలో బౌండరీలేమీ రాకపోవడంతో గెలుపు సమీకరణం 12 బంతుల్లో 21గా మారింది. ఆ టైమ్‌లో హార్దిక్ పాండ్య (25; 16 బంతుల్లో 2x4, 1x6), కోహ్లీ విక్టరీ అందించారు.
మెరిసిన ఇద్దరు!
నిర్ణయాత్మక మ్యాచులో టీమ్‌ఇండియానే టాస్ వరించింది. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ కామెరాన్ వచ్చిందే తడవుగా భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. బుమ్రా, భువీ, అక్షర్ బౌలింగ్‌ను చితకబాదడంతో పవర్‌ప్లేలో ఆసీస్ 66 రన్స్ చేసింది. అయితే 3.3వ బంతికి ఫించ్ (7)ను అక్షర్ ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ చేసి భీకరంగా ఆడుతున్న గ్రీన్‌ను భువీ పెవిలియన్ పంపించాడు. అప్పటికి ఆసీస్ స్కోరు 62. మిడిల్ ఓవర్లలో టీమ్‌ఇండియా బౌలర్లు పుంజుకున్నారు. 10 పరుగుల వ్యవధిలో స్మిత్ (9), మాక్సీ (6)ను పెవిలియన్ పంపించారు. చాహల్ బౌలింగ్ స్మిత్ స్టంపౌట్ అవ్వగా అక్షర్ త్రోకు మాక్సీ రనౌట్ అయ్యాడు. కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న జోస్ ఇంగ్లిస్ (24)ను జట్టు స్కోరు 115 వద్ద అక్షరే ఔట్ చేశాడు. కొంత సేపటికే డేంజరస్ మాథ్యూవేడ్ (1) పెవిలియన్‌కు పంపించి మూమెంటమ్ షిప్ట్ చేశాడు. అయితే ఆఖర్లో డేనియెల్ సామ్స్, టిమ్ డేవిడ్ వరుసగా సిక్సర్లు, బౌండరీలు బాది ఆసీస్‌ను గట్టెక్కించారు. ఏడో వికెట్‌కు 34 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించారు.