IND vs AUS 3rd T20: హైదరాబాద్ టీ20లో టీమ్‌ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. కంగారూలను మోస్తరు స్కోరుకు పరిమితం చేయలేకపోయారు. పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులే ఇచ్చారు. మధ్య ఓవర్లలో పుంజుకొని వికెట్లు పడగొట్టినా డెత్ ఓవర్లలో బ్యాటర్లను అడ్డుకోలేదు. దాంతో 20 ఓవర్లకు ఆస్ట్రేలియా 186-7తో నిలిచింది. ఆసీస్‌లో ఓపెనర్ కామెరాన్ గ్రీన్ (52; 21 బంతుల్లో 7x4, 3x6), టిమ్ డేవిడ్ (54; 27 బంతుల్లో 2x4, 4x6) హాఫ్ సెంచరీలు చేశారు. డేనియెల్ సామ్స్ (28*; 20 బంతుల్లో 1x4, 2x6) మెరిశాడు. అక్షర్ పటేల్ (3-33) బౌలింగ్‌లో అదరగొట్టాడు.
మెరిసిన ఇద్దరు!
నిర్ణయాత్మక మ్యాచులో టీమ్‌ఇండియానే టాస్ వరించింది. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ కామెరాన్ వచ్చిందే తడవుగా భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. బుమ్రా, భువీ, అక్షర్ బౌలింగ్‌ను చితకబాదడంతో పవర్‌ప్లేలో ఆసీస్ 66 రన్స్ చేసింది. అయితే 3.3వ బంతికి ఫించ్ (7)ను అక్షర్ ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీ చేసి భీకరంగా ఆడుతున్న గ్రీన్‌ను భువీ పెవిలియన్ పంపించాడు. అప్పటికి ఆసీస్ స్కోరు 62. మిడిల్ ఓవర్లలో టీమ్‌ఇండియా బౌలర్లు పుంజుకున్నారు. 10 పరుగుల వ్యవధిలో స్మిత్ (9), మాక్సీ (6)ను పెవిలియన్ పంపించారు.
అక్షర్ పటేల్ అదుర్స్
చాహల్ బౌలింగ్ స్మిత్ స్టంపౌట్ అవ్వగా అక్షర్ త్రోకు మాక్సీ రనౌట్ అయ్యాడు. కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న జోస్ ఇంగ్లిస్ (24)ను జట్టు స్కోరు 115 వద్ద అక్షరే ఔట్ చేశాడు. కొంత సేపటికే డేంజరస్ మాథ్యూవేడ్ (1) పెవిలియన్‌కు పంపించి మూమెంటమ్ షిప్ట్ చేశాడు.అయితే ఆఖర్లో డేనియెల్ సామ్స్, టిమ్ డేవిడ్ వరుసగా సిక్సర్లు, బౌండరీలు బాది ఆసీస్‌ను గట్టెక్కించారు. ఏడో వికెట్‌కు 34 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించారు.