IND vs AUS 3rd T20: మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీసులో భారత్‌, ఆస్ట్రేలియా కీలకమైన నిర్ణయాత్మక పోరుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా టాస్ గెలిచింది. వెంటనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఉప్పల్‌ పిచ్‌ ఎప్పుడూ ఛేదనకే అనుకూలిస్తుందని పేర్కొన్నాడు. రిషభ్ పంత్‌ ఆడటం లేదని భువనేశ్వర్‌ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చాడని వెల్లడించాడు.




తుది జట్లు


భారత్‌: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌


ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్‌, కామెరాన్‌ గ్రీన్‌, స్టీవెన్‌ స్మిత్‌, మాక్స్‌వెల్‌, టిమ్‌ డేవిడ్‌, జోస్‌ ఇంగ్లిస్‌, మాథ్యూ వేడ్‌, డేనియెల్‌  సామ్స్‌, ప్యాట్‌  కమిన్స్‌, ఆడమ్‌ జంపా, జోస్ హేజిల్‌ వుడ్‌


బ్యాట్స్ మెన్ ఓకే


భారత బ్యాట్స్ మెన్ ఫామ్ లోనే కనిపిస్తున్నారు. ఓపెనర్లు రోహిత్, రాహుల్ మంచి భాగస్వామ్యాలు నిర్మిస్తున్నారు. ఫస్ట్ టీ20లో వీరిద్దరు మంచి పరుగులు చేశారు. రెండో టీ20లోనూ రోహిత్ అదరగొట్టాడు. అయితే వీరు నిలకడగా ఆడాల్సిన అవసరముంది. ఇక కోహ్లీ ఆసియా కప్ ఫాంను కొనసాగించలేకపోతున్నాడు. తొలి మ్యాచ్ లో విఫలమైన విరాట్ రెండో మ్యాచులో రెండు బౌండరీలు కొట్టి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే స్పిన్నర్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఇక సూర్యకుమార్, పాండ్య ఆశించిన మేర ఆకట్టుకోవడంలేదు. ఒక మ్యాచ్ బాగా ఆడితే.. రెండో దానిలో తేలిపోతున్నారు. దినేశ్ కార్తీక్ రెండో టీ20లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. అది కొనసాగించాల్సిన అవసరముంది. ఆసీస్ లాంటి మేటి బౌలర్లున్న జట్టుపై రాణించాలంటే బ్యాట్స్ మెన్ సమష్టిగా రాణించాలి. 


బౌలింగ్ గుబులు


టీ20ల్లో భారత బౌలర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఆసియా కప్ లో బౌలింగ్ వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచులను కోల్పోయిన భారత్.. ఆసీస్ తో సిరీస్ లోనూ అది కొనసాగిస్తోంది. మొదటి మ్యాచులో భారీ స్కోరును కాపాడుకోలేకపోయింది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ తేలిపోతున్నాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారత బౌలర్లు విఫలమవడం టీమిండియాను కలవరపెడుతోంది. రెండో మ్యాచుకు అందుబాటులోకి వచ్చిన స్టార్ బౌలర్ బుమ్రా పరవాలేదనిపించాడు. ఇక స్పిన్నర్ చహాల్ అస్సలు ఆకట్టుకోవడం లేదు. పరుగులు నియంత్రించనూ లేక.. వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ రాణిస్తుండడం కొంత నయం. ఈ మ్యాచులో చహాల్ కు బదులు అశ్విన్ ను తీసుకుంటారేమో చూడాలి.