MS Dhoni LIVE: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కు రిటైర్ మెంట్ ప్రకటించునున్నాడా? ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మహీ.. భారత టీ20ల నుంచి కూడా తప్పుకోనున్నాడా? ధోని బ్యాటింగ్ మెరుపులను, కీపింగ్ నైపుణ్యాలను, నాయకత్వ మహత్యాలను ఇంక చూడలేమా? ఇప్పుడు ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని మనసులను తొలిచేస్తున్న ప్రశ్నలివే. వీటన్నింటికీ కారణం ధోనీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక సందేశం.
ఏమిటా ఎక్సైటింగ్ న్యూస్
సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండే ధోనీ.. తన నాయకత్వంలో తొలి టీ20 ప్రపంచకప్ అందుకున్న రోజైన సెప్టెంబర్ 24న ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశాడు. 'ఎక్సైటింగ్ న్యూస్ ఒకటి చెప్తాను. అందరూ ఎదురుచూస్తుండండి' అంటూ ఫేస్ బుక్ లో సందేశం ఉంచాడు. సెప్టెంబర్ 25న మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పాడు. అప్పటినుంచి ధోని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఐపీఎల్ కు కూడా రిటైర్ మెంట్ చెప్తాడేమో అని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన భారత మాజీ కెప్టెన్.. కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. భారత టీ20 లీగ్ ప్రారంభం నుంచి చెన్నైకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 4 సార్లు చెన్నైకు కప్ ను అందించాడు. గత సీజన్ లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని జడేజాకు బాధ్యతలు అప్పగించాడు. అయితే జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో మళ్లీ ధోనీనే పగ్గాలు అందుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ ధోనికి చివరిది అని అందరూ భావించారు. ఈ సీజన్ ను హోమ్ అండ్ ఎవే పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో చెపాక్ లో గ్రాండ్ గా వీడ్కోలు పలుకుతాడని అభిమానులు ఆశించారు. అయితే ఇప్పుడు ధోని ఇచ్చిన సందేశం దేని గురించో అని అభిమానులు కంగారు పడుతున్నారు. మరికొందరేమో ఏదైనా కొత్త బిజినెస్ చేయబోతున్నాడా అనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మరికొందరేమో ఇదంతా ఫేస్ బుక్ ప్రమోషన్ కోసమంటూ కామెంట్లు పెడుతున్నారు. వీటన్నింటికి ధోనీయే సమాధానం చెప్పాలి.
ఏదైనా సరే సడెన్ గా చేయడం ధోనికి అలవాటు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో ధోని ఉన్నపళంగా టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడని ధోని.. 2020 ఆగస్టు 15న వన్డే, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ధోని లైవ్ లో మాట్లాడతానని మెసేజ్ పెట్టడంతో ధోని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.