IND vs AUS 3rd T20: టీ20 సిరీస్ ఫలితం తేల్చే కీలకమైన మూడో మ్యాచ్ కు భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో నేడే మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. దాదాపు మూడేళ్ల తర్వాత భాగ్యనగరంలో క్రికెట్ మ్యాచ్ జరగడం, టికెట్ల వివాదం, అభిమానుల తొక్కిసలాట.. ఇలాంటి వాటితో ఈ మ్యాచ్ మరితం ఉత్కంఠగా మారనుంది. 


209 పరుగుల భారీ స్కోరు చేసినా.. బౌలర్ల వైఫల్యంతో మొదటి మ్యాచ్ ను కోల్పోయింది టీమిండియా. సిరీస్ లో నిలవాటంటే తప్పక గెలవాల్సిన రెండో మ్యాచులో కుదించిన ఓవర్లలో భారత్ అద్భుత విజయం సాధించింది. బ్యాట్స్ మెన్ నిలకడగా రాణించటంతో 8 ఓవర్లకు 91 పరుగులను ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్య రాణించడం, చివర్లో దినేశ్ కార్తీక్ మెరుపులతో మరో 4 బంతులుండగానే విజయాన్నందుకుంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ నేడు ఉప్పల్ వేదికగా జరగనుంది.


బ్యాట్స్ మెన్ ఓకే


భారత బ్యాట్స్ మెన్ ఫామ్ లోనే కనిపిస్తున్నారు. ఓపెనర్లు రోహిత్, రాహుల్ మంచి భాగస్వామ్యాలు నిర్మిస్తున్నారు. ఫస్ట్ టీ20లో వీరిద్దరు మంచి పరుగులు చేశారు. రెండో టీ20లోనూ రోహిత్ అదరగొట్టాడు. అయితే వీరు నిలకడగా ఆడాల్సిన అవసరముంది. ఇక కోహ్లీ ఆసియా కప్ ఫాంను కొనసాగించలేకపోతున్నాడు. తొలి మ్యాచ్ లో విఫలమైన విరాట్ రెండో మ్యాచులో రెండు బౌండరీలు కొట్టి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే స్పిన్నర్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. ఇక సూర్యకుమార్, పాండ్య ఆశించిన మేర ఆకట్టుకోవడంలేదు. ఒక మ్యాచ్ బాగా ఆడితే.. రెండో దానిలో తేలిపోతున్నారు. దినేశ్ కార్తీక్ రెండో టీ20లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. అది కొనసాగించాల్సిన అవసరముంది. ఆసీస్ లాంటి మేటి బౌలర్లున్న జట్టుపై రాణించాలంటే బ్యాట్స్ మెన్ సమష్టిగా రాణించాలి. 



బౌలింగ్ గుబులు


టీ20ల్లో భారత బౌలర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఆసియా కప్ లో బౌలింగ్ వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచులను కోల్పోయిన భారత్.. ఆసీస్ తో సిరీస్ లోనూ అది కొనసాగిస్తోంది. మొదటి మ్యాచులో భారీ స్కోరును కాపాడుకోలేకపోయింది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ తేలిపోతున్నాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారత బౌలర్లు విఫలమవడం టీమిండియాను కలవరపెడుతోంది. రెండో మ్యాచుకు అందుబాటులోకి వచ్చిన స్టార్ బౌలర్ బుమ్రా పరవాలేదనిపించాడు. ఇక స్పిన్నర్ చహాల్ అస్సలు ఆకట్టుకోవడం లేదు. పరుగులు నియంత్రించనూ లేక.. వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ రాణిస్తుండడం కొంత నయం. ఈ మ్యాచులో చహాల్ కు బదులు అశ్విన్ ను తీసుకుంటారేమో చూడాలి. 



ఆస్ట్రేలియాతో జాగ్రత్త


ఆస్ట్రేలియా జట్టులో పెద్దగా సమస్యలు కనిపించడంలేదు. ఫించ్, వేడ్, మాక్స్ వెల్, టిమ్ డేవిడ్, స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్ మెన్లతో పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మాథ్యూ వేడ్ విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. తొలి టీ20లో అతని ఇన్నింగ్స్ ఆసీస్ ను గెలిపించింది. అయితే బౌలర్లు అంతగా రాణించడంలేదు. స్పిన్నర్ జంపా ఒక్కడే ఆకట్టుకుంటున్నాడు. 



ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టును ఓడించాలంటే జట్టంతా సమష్టిగా రాణించాలి. టీ20 ప్రపంచకప్ కు సన్నాహకంగా ఈ మ్యాచులను ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఆ మెగా టోర్నీలో రాణించాలంటే ఈ మాత్రం ప్రదర్శన ఎంతమాత్రం సరిపోదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అసాధారణ పోరాటం చూపించాల్సిందే. ఆసీస్ తో పొట్టి సిరీస్ నెగ్గితే అది ఖచ్చితంగా భారత జట్టులో ఆత్మవిశ్వాసం నింపుతుంది. మరి మన భాగ్యనగరంలో సిరీస్ భాగ్యం దక్కుతుందేమో చూద్దాం.



తుది జట్లు (అంచనా)


భారత్‌


రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, చాహల్‌/అశ్విన్‌.


ఆస్ట్రేలియా


ఫించ్‌ (కెప్టెన్‌), గ్రీన్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఇగ్లిస్, డేవిడ్‌, వేడ్‌, కమిన్స్‌, ఎల్లిస్ సామ్స్, అబాట్‌, ఆడమ్‌ జంపా, హేజిల్‌వుడ్‌.


పిచ్‌, వాతావరణం


ఉప్పల్‌ వికెట్‌ సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. 2019లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20లోనూ విండీస్‌ 207 రన్స్‌ సాధించగా.. కోహ్లీ 94 (నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో భారత్‌ 209 పరుగులు చేసి విజయం సాధించింది. నేటి మ్యాచ్‌ పిచ్‌పై కూడా దాదాపుగా పచ్చిక కనిపించడం లేదు. దీంతో బౌలర్లు కష్టపడాల్సిందే. ఇక ఆదివారం ఆకాశం దట్టమైన మేఘాలతో ఉండవచ్చు. అలాగే చిరు జల్లులకు ఆస్కారం ఉంది.