IND vs AUS 3rd T20: ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) టీమ్‌ఇండియా బౌలర్లకు మరోసారి చుక్కలు చూపించాడు. ఉన్నది ఐదు ఓవర్లే గానీ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు దంచుతూ బౌలర్లకు దడపుట్టించాడు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఏడు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదేశాడు. దాంతో మూడో టీ20లో పవర్ ప్లే ముగిసే సరికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.
ఈ సిరీసులో కామెరాన్ గ్రీన్‌తో ఆస్ట్రేలియా ప్రయోగాలు చేపట్టింది. రెగ్యులర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లేకపోవడంతో అతడికి అవకాశం ఇచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు అతడికి మంచి ప్రాక్టీస్ లభించేందుకే ఇలా చేసింది. పవర్‌ఫుల్ బౌలింగ్‌లో ఆడిస్తే మెగాటోర్నీలో మంచి ఫినిషింగ్‌లు ఇస్తాడిన ఓపెనింగ్‌కు దింపింది. అందుకు తగ్గట్టే అతడు రాణించాడు. టీమ్‌ఇండియా ఎంత మెరుగ్గా బౌలింగ్ చేసినా అతడు బలంగా బాదడమే పెట్టుకున్నాడు. ఫీల్డర్ల మీదుగా బయటకు పంపించాడు.
హైదరాబాద్‌లో తొలి ఓవర్ నుంచే కామెరాన్ గ్రీన్ దంచడం మొదలుపెట్టాడు. భువీ వేసిన ఈ ఓవర్లో రెండో బంతిని సిక్స్, మూడో బంతిని బౌండరీగా మలిచాడు. అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్లోనూ 2 బౌండరీలు కొట్టాడు. బుమ్రా వేసిన మూడో ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదాడు. ఐదు, ఆరు బంతుల్ని నేరుగా స్టాండ్స్‌లో పెట్టాడు. వీటిని మామూలుగా కొట్టలేదు. ఆ తర్వాత అక్షర పటేల్ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదేశాడు. ఈ క్రమంలో 4.3వ బంతికి సింగిల్ తీసి 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అయితే భువీ వేసిన 4.6వ బంతికి అతడు ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్ వేసిన బంతిని గాల్లోకి లేపగా కేఎల్ రాహుల్ చక్కగా ఒడిసిపట్టాడు.