IND vs AFG Asia Cup: ఆసియా కప్‌ ఆఖరి మ్యాచులోనూ టీమ్‌ఇండియా ప్రయోగాలు మానలేదు! ఈ సారి ఏకంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకే విశ్రాంతి ఇచ్చింది. కేఎల్‌ రాహుల్‌  నాయకత్వం వహిస్తున్నాడు. తుది జట్టులో మూడు మార్పులు చేశారు. కాగా టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అంటే ఈ మ్యాచ్ ఫలితమూ ఉత్కంఠకరంగానే ఉండనుంది.


3 మార్పులు


సూపర్-4 ఆఖరి మ్యాచులో భారత్, అఫ్గానిస్థాన్‌ తలపడుతున్న సంగతి తెలిసిందే. జట్టు ఎంపిక విషయంలో అనేక విమర్శలు వస్తున్న తరుణంలో మూడు మార్పులు చేశారు. దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌ను తీసుకున్నారు. రోహిత్ శర్మ, యుజ్వేంద్ర చాహల్‌, హార్దిక్‌ పాండ్యకు విశ్రాంతి ఇచ్చారు. నిజానికి ఈ పోరులో అక్షర్‌ పటేల్‌, దినేశ్‌ కార్తీక్‌ను తీసుకుంటారని ముందు నుంచీ ఊహించిందే. అయితే పంత్‌, భువీని పక్కకు పెడతారని భావించారు. ఇందుకు భిన్నంగా రోహిత్‌, పాండ్య తప్పుకున్నారు.


రాహుల్‌ మాటిది!


'టాస్‌ గెలిచినా మేం మొదట బ్యాటింగ్‌ చేయాలనే అనుకున్నాం. సవాల్‌గా తీసుకొని మంచి టార్గెట్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ప్రపంచకప్‌, ఇక్కడి కఠిన పరిస్థితుల నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని రోహిత్‌ అనుకున్నాడు. ప్రపంచకప్‌లో ప్రతి ఒక్కరూ రాణించేందుకు మా పాత్రలను ఫైనలైజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓడిపోవడం ఎవరికీ గొప్ప కాదు. కానీ మేం బలంగా పుంజుకుంటాం' అని రాహుల్‌ అన్నాడు.






భారత్‌ x అఫ్గాన్‌ తుది జట్లు


భారత్‌: కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, దీపక్‌ హుడా, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అర్షదీప్‌ సింగ్‌ 


అఫ్గానిస్థాన్‌: హజ్రతుల్లా జజాయ్‌, రెహ్మతుల్లా గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, నజీబుల్లా జద్రాన్‌, మహ్మద్‌ నబీ, కరీమ్‌ జనత్‌, రషీద్ ఖాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయి, ఫరీద్‌ అహ్మద్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్, ఫజల్‌ హఖ్‌ ఫరూఖీ


పిచ్‌ వీరికి అనుకూలం


ఈ మ్యాచ్‌ దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడి వాతావరణం చాలా ఉక్కగా ఉంటుంది. ఎక్కువ క్రికెట్‌ ఆడుతుండటంతో పిచ్‌లపై జీవం పోతోంది. వికెట్లు బ్యాటింగ్‌ నుంచి బౌలింగ్‌కు అనుకూలంగా మారుతున్నాయి. స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. ఎప్పట్లాగే తొలుత బౌలింగ్‌ చేసిన జట్లకే గెలుపు అవకాశాలు ఎక్కువ. అందుకే టాస్‌ కీలకం.