Babar Azam:  ఆటలో ఒడిదొడుకులు ఒక భాగం అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం అన్నాడు. క్రికెటర్ కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమని వ్యాఖ్యానించాడు. ఏ ఆటగాడైనా బరిలో దిగిన ప్రతిసారి పరుగులు సాధించాలని రూల్ ఏమీ లేదని అన్నాడు. ఆసియా కప్ 2022లో బాబర్ ఫాంలో లేడు. ఆడిన మ్యాచులలో 117.85 స్ట్రైక్ రేట్ తో కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. భారత్ పై చేసిన 14 పరుగులు అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు. ఈ క్రమంలోనే తన ఫాంపై బాబర్ స్పందించాడు. 


అదేమీ రూల్ కాదు కదా


తాను ప్రతి మ్యాచులో పరుగులు చేయాలని ఏమీ లేదని..  ఒక ఆటగాడి కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమని బాబర్ అజాం అన్నాడు. అలాంటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండడం ముఖ్యమని చెప్పాడు. మనపై మనకు నమ్మకముంటే పరుగులు అవే వస్తాయని పేర్కొన్నాడు. సెప్టెంబర్ 7న అఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో బాబర్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో పై విధంగా స్పందించాడు. 


కెప్టెన్ గా అదుర్స్


ఆసియా కప్ లో ఆటగాడిగా బాబర్ విఫలమైనప్పటికీ.. కెప్టెన్ గా పాకిస్థాన్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. లీగ్ దశలో భారత్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచులు గెలిచిన పాక్ ఫైనల్ కు చేరుకుంది. 


నిన్న జరిగిన మ్యాచ్ లో అఫ్ఘనిస్థాన్ పై పాక్ విజయం సాధించటంతో.. ఆ జట్టుతో పాటు శ్రీలంక ఫైనల్ బెర్తు దక్కించుకుంది.  ఫైనల్లోనూ పాక్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. ఆ జట్టు ఆటగాళ్లందరూ సూపర్ ఫాంలో ఉన్నారు. బ్యాటింగ్ లో రిజ్వాన్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, బౌలింగ్ లో నసీం షా, షాదాబ్ ఖాన్, రవూఫ్ తదితర ఆటగాళ్లతో పాక్ పటిష్ఠంగా ఉంది.