Women's T20 World Cup 2024:

టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024) లో వెస్డిండీస్(West Indies) దూకుడైన ఆటతీరుతో అలరిస్తోంది. అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ  విజయాలు సాధిస్తోంది. బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన మ్యాచులో ఘన విజయం సాధించి  గ్రూప్ బీలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ వైపు దూసుకెళ్తోంది. దక్షిణాఫ్రికా(SA), ఇంగ్లాండ్(ENG) వంటి బలమైన జట్లను వెనక్కి నెట్టి గ్రూప్ బీలో కరేబియన్ జట్టు ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. మెరుగైన రన్ రేట్ కారణంగానే ఇది సాధ్యమైంది.  గ్రూప్ బీలో మూడు మ్యాచ్‌ల్లో రెండో విజయాలతో విండీస్  గ్రూప్ బిలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ గ్రూప్‌లోని దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, విండీస్(WI) మూడు జట్లు...  రెండు సెమీ-ఫైనల్ బెర్తుల కోసం పోటీలో ఉన్నాయి. 

 

బంగ్లాదేశ్ పై ఘన విజయం

షార్జాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో విండీస్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బౌలర్ కరిష్మా రామ్‌హారక్ నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించింది. ఓ దశలో 12 ఓవర్లకు 73 పరుగులు చేసి మంచి స్థితిలో ఉన్న బంగ్లాదేశ్.. ఆ తర్వాత విండీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో నిగర్ సుల్తానా 39, దిలారా అక్తర్ 19, మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.వెస్టిండీస్ మొత్తం ఏడుగురు బౌలర్లను ఉపయోగించింది. బంగ్లా ఓపెనర్ షాతి రాణిని అవుట్ చేసి తొలి వికెట్ తీసుకున్న కరిష్మా రామ్‌హారక్.. షెమైన్ కాంప్‌బెల్లే ను ఒక మంచి బంతితో బౌల్డ్ చేసింది. రామ్‌హరాక్ నాలుగు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి  4 వికెట్లు తీసింది.  దీంతో బంగ్లా 103 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని వెస్టిండీస్ కేవలం 12.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. హేలీ మాథ్యూస్ 22 బంతుల్లో 34 పరుగులు చేసి విండీస్ కు సునాయసంగా విజయాన్ని అందించింది. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల్లో వరుసగా రెండో ఓటమితో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

 

పాకిస్థాన్ కీలక మ్యాచ్

టీ 20 ప్రపంచకప్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో పాకిస్థాన్ నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే భారత్ చేతిలో పరాజయం పాలైన పాక్... బలమైన ఆసిస్ ను ఓడించి సెమీస్ రేసులో నిలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు పాక్ పైనా విజయం సాధించి సెమీస్ కు దాదాపు చేరుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం పాకిస్థాన్ కు అంత తేలిక కాదు. ఇప్పటికే దూకుడుగా ఆడుతున్న కంగారులు... పాక్ ను మట్టికరిపంచాలని చూస్తున్నారు.