PAK vs ENG 1st Test 2024: అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్(PAK) క్రికెట్ జట్టు కష్టాలు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న సొంత గడ్డపై బంగ్లాదేశ్(BAN) క్లీన్ స్వీప్ చేయగా..ఇప్పుడు ఇంగ్లాండ్(ENG)అదే పని చేస్తోంది. పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ రికార్డుల రికార్డులు నెలకొల్పింది. సొంతగడ్డపైనా పాక్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో... బ్రిటీష్ జట్టు బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. పాక్ బౌలర్లను గల్లీ బౌలర్లుగా మార్చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు నమోదు చేశారు. అంతేనా హ్యారీ బ్రూక్.. త్రిశతకంతో చెలరేగగా... అద్భుత ఫామ్ కొనసాగిస్తూ రూట్ డబుల్ సెంచరీ బాదేశాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్ల నష్టానికి 823 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
బ్రూక్, రూట్ ఊచకోత
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జరుగుతున్న ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో... పాకిస్తాన్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. బజ్‌బాల్ ఆటతో ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఇంగ్లాండ్.. తమ దూకుడైన ఆటతీరు ఎలా ఉంటుందో పాకిస్థాన్ జట్టుకు ప్రత్యక్షంగా చూపించింది. పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరు 823/7 నమోదు చేశారు. జో రూట్ ద్వి శతకం చేయగా... హ్యారీ బ్రూక్(Harry Brook) ముల్తాన్‌లో ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ చరిత్రలో వేగవంతమైన రెండో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగానూ బ్రూక్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 322 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 29 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 317 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ తన త్రి శతకాన్ని 310 బంతుల్లో పూర్తి చేశాడు. ఇది టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీగా నిలిచింది. భారత జట్టు మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్(Virendra Sehwag) పేరిట టెస్టుల్లో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డు ఇంకా పదిలంగా ఉంది. 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెహ్వాగ్ కేవలం 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. తొలుత చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన బ్రూక్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి టెస్టులో నాలుగో రోజు టెస్ట్ క్రికెట్‌లో తన తొలి ట్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు. పాకిస్థాన్ టూర్‌లో ఇంగ్లాండ్‌కు మరో స్టార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ రూపంలో లభించాడు. ఆసియా దేశ పిచ్‌లపై బ్రూక్ సెంచరీ చేయడం విశేషం. రూట్ కూడా 375 బంతుల్లో 17 బౌండరీల సాయంతో 262 పరుగులు చేశాడు. వీరిద్దరితోపాటు జాక్ క్రాలే (78), డకెట్ (84) పరుగులతో రాణించడంతో బ్రిటీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 823 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు 267 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. టెస్టుల్లో మూడుసార్లు 800 కంటే ఎక్కువ రన్స్ చేసిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది.
తొలి ఇన్నింగ్స్‌లో పాక్ ఇలా..
ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 556 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, షాన్ మసూద్ సెంచరీలు చేశారు. సౌద్ షకీల్ (82) పరుగులతో రాణించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌కు కీలకమైన 267 పరుగుల ఆధిక్యం లభించడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌లో ఎంతవరకూ పోరాడుతుందో చూడాలి.