Women's T20 World Cup 2024 India Achieve Biggest-Ever T20 WC Win: 


టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) సెమీస్‌ ఆశలు నిలవాలంటే తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్‌.. రన్‌ రేట్‌ పెంచుకోవాల్సిన మ్యాచ్‌... ప్రత్యర్థి ఆసియాకప్‌లో మనపై గెలిచి రంకెలెస్తోంది. మరో పక్క చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌(Pakistan) రన్‌రేట్ మనకంటే మెరుగ్గా ఉంది.. అలాంటి మ్యాచ్‌లో టీమిండియా(Team India) చెలరేగిపోయింది. ప్రత్యర్థి శ్రీలంక(Srilanka)ను చిత్తుచిత్తూ చేస్తూ టీ 20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టాపార్డర్‌ బ్యాటర్లు జూలు విదిల్చి భారీ స్కోరు చేసి శ్రీలంకను బెదరగొట్టగా... బౌలర్లు బంతులతో భయపెట్టారు. ఈ విజయంతో గ్రూప్‌ ఏలో భారత్‌ రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 172 పరుగులు చేయగా.. లంక కేవలం 90 పరుగులకే కుప్పకూలింది. 


టాపార్డర్‌ జోరు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్ కౌర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. షెఫాలీ వర్మ.. స్మృతి మంధాన్న భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆరంభం నుంచే షెఫాలీ వర్మ ధాటిగా ఆడగా.... స్మృతి క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త సమయం తీసుకుంది. షెఫాలీ వర్మ దూకుడుతో ఆరంభంలో భారత్‌ స్కోరు దూసుకెళ్లింది. పవర్‌ ప్లే ముగిసే సరికి భారత్‌ ఒక్క వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. అప్పటి వరకూ నెమ్మదిగా ఆడిన   స్మృతి మంధాన్న క్రీజులో నిలదొక్కుకున్నాక చెలరేగిపోయింది. షెఫాలీ స్కోరును దాటి 50 పరుగులు పూర్తి చేసుకుంది. 38 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో  స్మృతి మంధాన్న 50 పరుగులు పూర్తి చేసుకుంది. సరిగ్గా 50 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగింది.  స్మృతి మంధాన్న అవుటైన తర్వాతి బంతికే షెఫాలీ వర్మ అవుటైంది. 40 బంతుల్లో నాలుగు ఫోర్లతో 42 పరుగులు చేసిన షెఫాలీ.. దూకుడుగా ఆడే క్రమంలో అవుటైంది. దీంతో 98 పరుగుల వద్దే భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ ఆనందం లంకకు ఎంతో సేపు నిలవలేదు.





 

హర్నన్‌ విధ్వంసం

వీరిద్దరూ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్‌ విధ్వంసం సృష్టించింది. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి బాదేసింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ కొట్టిన సిక్సర్‌ను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. కేవలం 27 బంతుల్లో ఒక సిక్సు, 8 ఫోర్లతో హర్మన్‌ 52 పరుగులు చేసింది. హర్మన్‌ చేసిన 52 పరుగుల్లో 38 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. చివరి ఓవర్‌ చివరి  రెండు బంతులను రెండు ఫోర్లుగా కొట్టి మరీ హర్మన్‌ అర్ధ శతకాన్ని పూర్తి చేసుకుంది. భారత బ్యాటర్ల దూకుడుతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 

 

లంక.. పేకమేడలా

173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంకను భారత బౌలర్లను వణికించారు. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో లంక 19.5 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలి 82 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కవిశా దిల్లారి 21, సంజీవని 20, కాంచన 19 పరుగులతో ఓ మోస్తరు స్కోరు చేశారు. మిగిలిన బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 3, ఆషా శోభన మూడు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత జట్టు గ్రూప్‌ ఏలో రెండో స్థానానికి ఎగబాకింది.