Ashleigh Gardner:  మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా జరగిన మ్యాచ్ లో ఆసీస్ కేవలం 5 పరుగుల తేడాతో గెలిచింది. 173 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 167 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో 31 పరుగులు చేయటంతో పాటు 2 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ యాష్లే గార్డెనర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది. మ్యాచ్ అనంతరం విలేకర్ల సమావేశంలో గార్డెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 


ఈ సెమీస్ మ్యాచ్ లో ఒక దశలో తాము విజయానికి అర్హులం కాదని అనిపించిందని.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ యాష్లే గార్డెనర్ పేర్కొంది. అయితే జట్టు సభ్యులందరూ అసాధారణంగా పోరాడటంతో విజయం సాధించామని చెప్పింది. గార్డెనర్ మాట్లాడుతూ... 'భారత్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ వద్ద ఉన్నప్పుడు మేం విజయం సాధిస్తామని అనుకోలేదు. అప్పుడు భారత్ డ్రైవర్ సీట్ లో ఉంది. మ్యాచ్ గెలిచేందుకు వారికే ఎక్కువ అవకాశం ఉంది. అయితే అద్భుత విజయాన్ని అందుకోవడంలో మా జట్టులోని ప్రతి సభ్యురాలు తమ తమ పాత్రలను పోషించారు' అని గార్డెనర్ తెలిపింది. భారత్ 10వ ఓవర్ వద్ద ఉన్నప్పుడు అందరూ తమ ఓటమి గురించి ఆలోచించి ఉంటారని గార్డెనర్ అంది. 'అప్పుడు అందరూ మేం ఓడిపోతామనే అనుకుని ఉంటారు. అయితే ఈ పరిస్థితుల్లో ఉత్తమమైన జట్లు మాత్రమే గెలుస్తాయని నాకు అనిపించింది.' అని చెప్పింది. 






అత్యుత్తమ విజయాలలో ఇదొకటి: మెగ్ లానింగ్


భారత్‌తో జరిగిన సెమీఫైనల్ లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ తెలిపింది. ఇది తన కెరీర్‌లో అత్యుత్తమ విజయాలలో ఒకటని ఆమె పేర్కొంది ఈ మ్యాచ్ లో గొప్ప పోరాట పటిమ ప్రదర్శించిన తన జట్టు సభ్యులను చూసి తాను చాలా గర్వపడుతున్నాని చెప్పింది. 'నేను పాల్గొన్న అత్యుత్తమ విజయాలలో ఇదొకటి. ఇందులో మా అత్యుత్తమ క్రికెట్ ఆడనప్పటికీ చివరికి మేం విజయం సాధించాం. మ్యాచ్ లో వెనుకబడి గెలవడం సంతోషంగా ఉంది. మా అమ్మాయిల నుంచి గొప్ప పోరాట పటిమ చూశాను. వారి గురించి చాలా గర్వపడుతున్నాను' అని లానింగ్ అంది.