Dhoni Test Double Century: ఎంఎస్ ధోనీ.. భారత క్రికెట్ కు ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, ఆటగాడిగా ధోనీ టీమిండియాకు ఎన్నో సేవలు అందించాడు. భారతదేశానికి రెండోసారి వన్డే ప్రపంచకప్ ను తీసుకొచ్చాడు. ఐసీసీ ట్రోఫీలను గెలిచాడు. కెప్టెన్ కూల్ గా ఎన్నో మన్ననలందుకున్నాడు. 2020 ధోనీ అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున (ఫిబ్రవరి 24) ధోనీ తనకే సాధ్యమైన ఒక రికార్డును నెలకొల్పాడు. అదేంటంటే...
సరిగ్గా దశాబ్దం క్రితం ఇదే రోజు (ఫిబ్రవరి 24)న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. 2013 ఫిబ్రవరి, 24న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ధోనీ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్ లో మొత్తం 224 పరుగులు చేశాడు. ధోనీ ఇన్నింగ్స్ తో భారత్ ఆసీస్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పటికీ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చరిత్రలో ధోనీ ఇన్నింగ్స్ అత్యుత్తమ వాటిలో ఒకటిగా మిగిలిపోయింది.
ధోనీ క్లాస్ ఇన్నింగ్స్
చెన్నై వేదికగా ఆస్ట్రేలియాపై ధోనీ ఆడిన 224 ఇన్నింగ్స్ చెన్నై, టీమిండియా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 380 పరుగులు చేసింది. ఆ జ్టటు కెప్టెన్ మైఖెల్ క్లార్క్ 130 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ పుజారా, సచిన్ ల వికెట్లు త్వరగా కోల్పోయింది. ధోనీ క్రీజులోకి వచ్చే సమయానికి 4 వికెట్లకు 196 పరుగులతో నిలిచింది. అప్పుడు కోహ్లీతో జతకలిసిన ధోనీ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేశాడు. 224 పరుగులు చేశాడు. దీంతో భారత్ 572 పరుగులు చేసింది. మ్యాచ్ గెలిచింది. ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
ధోనీ కెరీర్
ఎంఎస్ ధోనీ 2020 ఆగస్ట్, 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన కెరీర్ లో ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాడు. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్ గా చరిత్ర లిఖించాడు. 2011లో దేశానికి వన్డే ప్రపంచకప్ ను అందించాడు. వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు సాధించాడు. ధోనీ ప్రపంచంలోనే గొప్ప కెప్టెన్, గొప్ప వికెట్ కీపర్ అని ఇప్పటికీ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడతారు. ప్రస్తుతం 2023 ఐపీఎల్ సీజన్ కోసం ధోనీ సిద్ధమవుతున్నాడు.