IND vs AUS 3rd Test:
ఇండోర్ టెస్టుకు ముందు ఆసీస్‌కు షాక్! ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. కుటుంబ కారణాలతో స్వదేశంలోనే ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అతడి గైర్హాజరీలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది.
దిల్లీ టెస్టు ఓడిపోయిన వెంటనే ప్యాట్ కమిన్స్ సిడ్నీకి వెళ్లిపోయాడు. అనారోగ్యానికి గురైన అతడి తల్లిని చూసుకుంటున్నాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఇండోర్ టెస్టు ఆడేందుకు అతడు రిటర్న్ టికెట్ సైతం బుక్ చేసుకున్నాడు. ఆదివారం రావాలనుకున్నాడు. ఇంతలోనే తన నిర్ణయం మార్చుకున్నాడు. కొన్ని రోజులు కుటుంబంతోనే ఉండనున్నాడు. దాంతో వన్డే సిరీసుకు వస్తాడో లేదోనన్న సందిగ్ధం నెలకొంది.
'భారత్‌కు తిరిగి రావాలన్న నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నా కుటుంబంతో ఉండటమే మంచిదని అనిపించింది. నాకు అండగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు. నన్ను అర్థం చేసుకొన్నందుకు కృతజ్ఞతలు' అని కమిన్స్ తెలిపాడు.
కమిన్స్ సారథ్యం అందుకున్నాక అతడు అందుబాటులో లేనప్పుడు స్టీవ్ స్మిత్ ఆ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఇండోర్ టెస్టులో ఆసీస్‌ను అతడే నడిపించనున్నాడు. గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమైన మిచెల్ స్టార్క్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. మూడో టెస్టు ఆడతాడని తెలిసింది. స్కాట్ బొలాండ్, లాన్స్ మోరిస్ రూపంలో కంగారూలకు ఇతర పేస్ బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి.
నాగ్‌పుర్ టెస్టులో కమిన్స్‌తో పాటు బొలాండ్ ఆడాడు. ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవడంతో దిల్లీ టెస్టులో చోటు దక్కలేదు. అతడు ఆస్ట్రేలియా వెళ్లి దేశవాళీ క్రికెట్ ఆడాల్సింది. అయితే కమిన్స్‌కు కవర్‌గా ఇక్కడే ఉంచారు. రెండో టెస్టుకు ముందు స్వదేశానికి వెళ్లిన లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కామెరాన్ గ్రీన్ సైతం 100 శాతం ఫిట్‌నెస్ సాధించాడు. కాగా జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ వార్నర్, ఏస్టన్ ఆగర్ వేర్వేరు కారణాలతో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
IND vs AUS ODI Series: వచ్చే నెలలో భారత్ తో జరగనున్న 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయాలతో ప్రస్తుత టెస్ట్ సిరీస్ కు దూరమైన ముగ్గురు కీలక ఆటగాళ్లు వన్డే జట్టులోకి వచ్చారు. ఆల్ రౌండర్లు గ్లెన్ మాక్స్ వెల్, మిచెల్ మార్ష్, జై రిచర్డ్ సన్ లు వన్డే స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నారు. వీరి రాకతో ఆస్ట్రేలియా జట్టు మరింత బలంగా మారనుంది.
భారత్ తో వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమిన్స్ నాయకత్వం వహించనున్నాడు. గాయంతో మిగిలిన రెండు టెస్టులకు దూరమైన విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు కూడా వన్డే జట్టులో స్థానం లభించింది. అలాగే స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ కూడా జట్టులో ఉన్నారు.
భారత్ తో వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, జై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.