Jasprit Bumrah Fitness: ప్రస్తుతం భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్. నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లలో బుమ్రా తిరిగి జట్టులోకి వస్తాడని అందరూ ఊహించారు. కానీ సెలక్టర్లు అతనిని జట్టులోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే కంగారూలతో వన్డే సిరీస్‌లో కూడా జస్‌ప్రీత్ బుమ్రా కనిపించదు.
నిజానికి ఈ సంవత్సరం వన్డే ప్రపంచకప్‌తో పాటు జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని అతడిని జట్టులోకి తీసుకునేందుకు భారత సెలక్టర్లు తొందరపడకూడదని అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో రాబోయే ఐపీఎల్ సీజన్‌లో జస్‌ప్రీత్ బుమ్రా కచ్చితంగా ఆడగలడని అందరూ ఆశిస్తున్నారు.
దీనికి సంబంధించి మాజీ భారత ఆటగాడు ఆకాష్ చోప్రా ఒక స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ప్రకటనలో బుమ్రా మొదట భారతీయ ఆటగాడు, తరువాత అతని ఫ్రాంచైజీ కోసం ఆడతాడని చెప్పాడు. అందుకే అతను పూర్తి ఫిట్‌గా లేకుంటే భారత బోర్డు జోక్యం చేసుకోవాలని సూచించాడు. రాబోయే సీజన్‌లో జోఫ్రా ఆర్చర్‌తో బుమ్రా ఏడు మ్యాచ్‌లు ఆడకపోతే ప్రపంచమే అంతం కాదన్నాడు.
ఆకాష్ చోప్రా ఇంకా మాట్లాడుతూ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడే ఆడాలని తెలిపాడు. అతనితో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి బీసీసీఐ ఇష్టపడదని ఖచ్చితంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డాడు. అవసరమైతే బుమ్రా ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో కూడా బీసీసీఐ మాట్లాడుతుందని పేర్కొన్నాడు.
2022 సెప్టెంబర్‌లో జస్‌ప్రీత్ బుమ్రా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుండి అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ ప్రక్రియలో ఉన్నాడు. ఈ మధ్య శ్రీలంకతో వన్డే సిరీస్‌కు జట్టులోకి వచ్చినా పూర్తి ఫిట్‌నెస్‌తో ఆడలేకపోయాడు. అదే సమయంలో బుమ్రా కొంతకాలంగా NCAలో నిరంతరం ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు.
టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా! ఎంతటి బ్యాటర్‌కైనా అతడిని ఆడటం సులభం కాదు. ప్రతి క్షణం మ్యాచ్ పరిస్థితులను మదింపు చేస్తూనే ఉంటాడు. బ్యాటర్ మైండ్ సెట్‌ను చదువుతూనే ఉంటాడు. అతడి మానసిక పరిస్థితిని అంచనా వేసి బంతులు వేస్తాడు. తక్కువ రనప్‌తోనే ప్రపంచడమైన వేగాన్ని సృష్టిస్తాడు. ఎప్పుడు గమనించినా ఉత్సాహంగానే కనిపిస్తాడు. అలాంటిది ఒకానొక సందర్భంలో అలసిపోయానని, తక్కువ వేగంతో బంతులేస్తానని స్వయంగా చెప్పాడట! భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ ఈ సంఘటన గురించి తన పుస్తకం 'కోచింగ్ బియాండ్'లో వివరించాడు.
టీమ్‌ఇండియా 2019లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టును ఓడించింది. కుర్రాళ్లు, సీనియర్లు కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని అందించారు. ఆ సిరీసులోనే జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అలసిపోయాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో ఈ పేసుగుర్రం ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఆ తర్వాతి టెస్టుకోసం సిడ్నీకి చేరుకున్నాడు. చారిత్రకంగా ఆ పిచ్ పేసర్లకు అంతగా సహకరించింది. ఈ సారీ మరీ నిర్జీవంగా కనిపించింది. దాంతో ఆందోళనకు గురైన బుమ్రా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను (Bharat Arun) సంప్రదించాడు.
'సర్.. వికెట్ కాస్త నిర్జీవంగా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా లేదు' అని అరుణ్‌తో బుమ్రా చెప్పాడని శ్రీధర్ (R.Sridhar) రాశాడు. బౌలర్లు చెప్పిన మాటలను శ్రద్ధగా వినడమే అరుణ్ బలమని పేర్కొన్నాడు. ఆందోళనగా కనిపిస్తున్న బుమ్రా ఏదో చెప్పాలనకుంటున్నట్టు ఆయన గ్రహించాడని చెప్పాడు. అదేంటో తెలుసుకుందామని ఆగాడన్నాడు.
'నేను సొమ్మసిల్లిపోయాను సర్! మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. పర్సనల్‌గా నేనిలాంటి స్థితిలో ఉన్నాను. సిరీస్ పరంగా మనకేమీ ఇబ్బంది లేదు. పిచ్ మరీ నిర్జీవంగా ఉంది. బహుశా ఈ మ్యాచ్ డ్రా కావొచ్చు. మరి నన్నేం చేయమంటారు? వేగం తగ్గించి బంతులేయమంటారా' అని బుమ్రా ప్రశ్నించాడు.