ICC Under 19 World Cup 2024 Loss: అండర్‌ 19 ప్రపంచకప్‌(ICC Under 19 World Cup)ను ఆరోసారి ఒడిసిపట్టాలన్న యువ భారత్‌ ఆటగాళ్ల కల చెదిరింది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా అండర్‌ 19 ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ఓడించి కప్పును ఒడిసిపట్టింది. అప్రతిహాత విజయాలతో ఫైనల్‌ చేరిన టీమిండియా... కంగారుల సమష్టి ప్రదర్శన ముందు తలవంచింది. మొదట ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారత్‌.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో నిలబడలేకపోయిన ఆదర్శ్‌ సింగ్‌ (47; 77 బంతుల్లో 4×4, 1×6), హైదరాబాద్‌ కుర్రాడు మురుగన్‌ అభిషేక్‌ (42; 46 బంతుల్లో 5×4, 1×6) మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు.

 

ఆసీస్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బియర్డ్‌మన్‌ (3/15), మెక్‌మిలన్‌ (3/43), విడ్లర్‌ (2/35) విజృంభించారు. 21 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా పేసర్‌ మపాక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచాడు. దీనిపై బీసీసీఐ  కార్యదర్శి జై షా స్పందించారు. ఫైనల్స్‌లో భారత యువ ఆటగాళ్లు ఓడిపోయినా చెరగని స్ఫూర్తిని మిగిల్చారని జై షా అన్నారు. విజయం నుంచి కష్టాల వరకు, ప్రతి మ్యాచ్ బారత్ జట్టు తిరుగులేని ఆత్మ, సంకల్పం, నైపుణ్యానికి నిదర్శనంగా మారిందని కొనియాడాడు. జట్టులోని ప్రతిఒక్క సభ్యునికి, తాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జై షా తెలిపాడు. ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుకు జైషా అభినందనలు తెలిపారు.

 

తప్పని నిరాశ

ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్‌-19 ప్రపంచ‌ క‌ప్( U19 World Cup Final 2024)లోనూ కుర్రాళ్లకు నిరాశే ఎదురైంది. నవంబర్‌ 19, 2023న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. ఆదివారం ఫైనల్లో కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు.. కానీ ఆసీస్ విజయం సాధించి మరో ట్రోఫీని ముద్దాడింది.

 

254 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆస్ట్రేలియా కుర్రాళ్లు నాలుగోసారి అండర్ 19 వరల్డ్ కప్ కైవసం చేసుకున్నారు. సీనియర్లు ఎలాగైతే తుది మెట్టుపై కంగారు పడ్డారో, సరిగ్గా అదే తీరుగా భారత కుర్రాళ్లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు కంగారు పెట్టారు. ఆసీస్ బౌలర్లలో బార్డ్‌మాన్, మెక్ మిలన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, విడ్లర్ 2 వికెట్లు తీశాడు.ఓవరాల్‌గా ఇప్పటివరకూ భారత్‌ 9సార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్స్ ఆడగా.. 2000, 2008, 2012, 2018, 2022లో మొత్తం 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇంతకు ముందు 2006, 2016, 2020లలో ఫైనల్లో ఓటమిపాలైంది. తాజాగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ యువ భారత్ తుది మెట్టుపై బోల్తాపడింది. అండర్ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా.. చెరో రెండు ఫైనల్స్ నెగ్గి మెగా ట్రోఫీని అందుకున్నాయి.