Hyderabad win against Nagaland: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ అదరగొట్టింది. ఆడిన అయిదు మ్యాచుల్లోనూ విజయం సాధించి రంజీ ట్రోపి ప్లేట్‌ డివిజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ అయిదు మ్యాచుల్లోనూ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ విజయాలు సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 462 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయిన స్థితిలో డిక్లెర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో నాగాలాండ్‌ 206కే పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్‌ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ  188 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 150/4తో మెరుగ్గానే కనిపించిన ఆ జట్టు.. 38 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులో సుమిత్‌ (86), రుపెరో (59) మాత్రమే పోరాడారు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన తనయ్‌ త్యాగరాజన్‌ (6/81) రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభించడంతో నాగాలాండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. దీంతో  హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  ఆడిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలిచిన హైదరాబాద్‌ 35 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల 17న జరిగే ఫైనల్లో హైదరాబాద్‌.. మేఘాలయను ఢీకొంటుంది.


ఫామ్‌లోకి పృథ్వీ షా
భారత జట్టు యువ ఓపెనర్‌ పృథ్వీ షా(Prithvi Shaw) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. విధ్వంసకర ఆటతీరుతో మరోసారి సెలక్టర్ల తలుపు తట్టాడు. గాయంతో ఇన్నాళ్లు ఆటకు దూరమైన పృథ్వీ... వచ్చిరాగానే భారీ శతకంతో చెలరేగాడు. ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో షాకు ఇది పదమూడో సెంచరీ కావడం విశేషం. రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024)లో ముంబయి తరుపున బరిలోకి దిగిన షా... ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 159 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 18 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. గాయంతో బాధపడ్డ పృథ్వీ షా.. ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చాడు. లండన్‌లో సర్జరీ చేయించుకున్న తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మూడు నెలలు పాటు ఉండి ఫిట్‌నెస్‌ సాధించేందుకు కష్టపడ్డాడుయ ఆరు నెలలకు పైగా శ్రమించి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. పృథ్వీషాకు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహించిన జాతీయ క్రికెట్‌ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో తిరిగి రంజీ ట్రోఫీలో ముంబయి టీమ్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. 


అప్పట్లో ఆవేదన
అండర్ - 19 వరల్డ్ కప్ గెలిచి ఆ తర్వాత 20 ఏండ్లకే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షాను కొత్తలో వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చారు. మరో సచిన్ అయ్యే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్న వాదనలు వినిపించినా తర్వాత అతడు ఫామ్ కోల్పోయి ఇప్పుడు టీమిండియాలో ప్లేస్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. వెస్టిండీస్‌తో త్వరలో జరుగబోయే వన్డే, టీ20 సిరీస్‌తో పాటు ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో సైతం అతడికి ఛాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలో పృథ్వీ షా తన కెరీర్, అవకాశాలు రాకపోవడంతో  మానసికంగా కుంగుబాటుకు లోనైన దానిపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.