ICC T20 World Cup 2024: భారత్ వేదికగా  జరుగబోయే వన్డే వరల్డ్ కప్ తర్వాత  మరో  మెగా టోర్నీ హంగామా మొదలుకానుంది. వచ్చే ఏడాది జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరుగనుంది. ఈ మేరకు ఐసీసీ.. ప్రపంచకప్ ఆడబోయే  వేదికలను ఖరారుచేసింది. అమెరికాలో మూడు,  కరేబియన్ దీవులలోని ఏడు  ప్రాంతాలలో  ఈ మెగా టోర్నీ జరుగనుంది.  


ఈసారి టీ20 వరల్డ్ కప్‌ను వెస్టిండీస్‌తో పాటు అమెరికా కూడా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.  అగ్రరాజ్యంలోని న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడాలలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.  ఇక  కరేబియన్ దీవులలోని  అంటిగ్వా, బార్బడోస్, డొమినికా, గయానా,   సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్  నగరాల్లో  వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతాయి.  ఈ మేరకు ట్విటర్ ద్వారా అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. అయితే క్రికెట్ అంటే ఎంతో ఫ్యాషన్ ఉండే జమైకా నగరంలో మాత్రం టీ20 మ్యాచ్‌లు లేకపోవడం ఇక్కడి అభిమానులను నిరాశపరిచేదే. 


అయితే పైన పేర్కొన్న ఏడు వేదికలలో  గ్రూప్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి..?  సెమీస్, ఫైనల్స్ వేదికలు ఎక్కడ..? అనేది ఇంకా క్లారిటీ లేదు.  ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే జట్ల గురించి  క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడొచ్చు.






20 జట్లతో.. 


2024లో టీ20  ప్రపంచకప్‌లో 20 దేశాలు పాల్గొననున్నాయి.  ఇందులో  ఐసీసీ  నిర్వహించే మ్యాచ్‌ల ద్వారా నేరుగా అర్హత సాధించినవి కాగా మిగిలిన 8 జట్లు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్  పోటీల ద్వారా నిర్ణయించబడతాయి.   ఆస్ట్రేలియాలో నిర్వహించిన 2022 టీ20 వరల్డ్ కప్‌లో టాప్ - 8గా నిలిచిన  ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక,  సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించాయి.  టీ20‌ ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాత స్థానాలో ఉన్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ కూడా  క్వాలిఫై అవగా  ఆతిథ్య  దేశాల హోదాలో వెస్టిండీస్, యూఎస్ఎ కూడా  క్వాలిఫై అయింది. మిగిలిన జట్లు ఏవనేది టోర్నీ  ప్రారంభానికి కొద్దిరోజుల ముందు  స్పష్టత రానున్నది. 


గత  వరల్డ్ కప్‌లో కనీసం  క్వాలిఫై కూడా కాలేకపోయిన వెస్టిండీస్ ఈసారి  స్వదేశంలో  జరిగే టోర్నీ ద్వారా పునర్‌వైభవాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్నది.  ఇటీవల ఆ జట్టు వన్డే వరల్డ్ కప్‌కు కూడా క్వాలిఫై కాలేకపోయింది. వన్డే ప్రపంచకప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్‌ను రెండు సార్లు గెలుచుకున్న  విండీస్.. ఇటీవల కాలంలో దారుణ పతనం దిశగా సాగుతుండటం అభిమానులను కూడా ఆందోళనకు గురిచేసేదే. ఇక  రాబోయే పొట్టి ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగబోయే హై ఓల్టేజ్ పోరును  న్యూయార్క్‌లో నిర్వహించేందుకు ఐసీసీ సిద్ధమవుతున్నదని వార్తలు వస్తున్నాయి.