ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ విజయంతో ప్రారంభించింది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 48.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్లు తీసిన భారత పేసర్ మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52: 53 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (71: 77 బంతుల్లో, 10 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (74: 63 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించారు. కేఎల్ రాహుల్ (58 నాటౌట్: 63 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (50: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో షమి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున జంపా రెండు వికెట్లు పడగొట్టాడు.
అదరగొట్టిన బ్యాటర్లు
277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (71: 77 బంతుల్లో, 10 ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (74: 63 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు చాలా వేగంగా పరుగులు చేశారు. దీంతో భారత్ 10 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 66 పరుగులు సాధించింది.
వీరి దూకుడు ఆ తర్వాత కూడా ఆగలేదు. మాథ్యూ షార్ట్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షాన్ అబాట్ వేసిన 18వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ కూడా అర్థ శతకం సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు ఇదే మొదటి అర్థ శతకం. వీరి భాగస్వామ్యం బలపడుతున్న దశలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడం జంపా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
కాసేపటికే లేని పరుగుకు ప్రయత్నించి శ్రేయస్ అయ్యర్ (3: 8 బంతుల్లొ) రనౌటయ్యాడు. శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి జంపానే ఆస్ట్రేలియాకు మూడో వికెట్ అందించాడు. దీంతో భారత్ కేవలం తొమ్మిది పరుగుల వ్యవధిలోనే టాప్ ఆర్డర్ బ్యాటర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్ (18: 26 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.
కెప్లెన్ కేఎల్ రాహుల్ (58 నాటౌట్: 63 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (50: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) భారత్‌ను విజయం వైపు నడిపించారు. వీరు ఐదో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. విజయానికి 12 పరుగుల దూరంలో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయినప్పటికీ కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజులో ఉండి భారత్‌ను గెలిపించాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial